ఉద్యోగుల విభజనకు మే 8న మార్గదర్శకాలు
* కేంద్రమంత్రి జైరాం రమేశ్ వెల్లడి
* కేంద్ర హోంకార్యదర్శి పర్యవేక్షణ
* హైకోర్టు విభజనకు న్యాయశాఖకు ప్రతిపాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య ఉద్యోగుల విభజనకు అనుసరించాల్సిన ముసాయిదా మార్గదర్శకాలను వచ్చేనెల (మే) 8న వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామని రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. విభజన ప్రక్రియపై కేంద్ర హోంశాఖ అధికారులతో మంగళవారం చర్చించిన అనంతరం ఆయన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. పోలింగ్‌కు ముందుగా మార్గదర్శకాలు విడుదల చేస్తే ఇబ్బందులు వస్తాయని, అందుకోసమే సీమాంధ్రలో మే 7న పోలింగ్ ముగిసిన మరునాడు మార్గదర్శకాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
విభజనపై ఏర్పాటయని 21 కమిటీల నివేదికలను కూడా మే 8న వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపారు. మే 9న సమావేశమై విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి అనుసరించాల్సిన విధానంపై చర్చించనున్నామని చెప్పారు. కొత్త రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత విభజన పనులు సజావుగా పూర్తి చేయడానికి, విభజన ప్రక్రియను పర్యవేక్షించడానికి వీలుగా కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో 2 రాష్ట్రాల సంయుక్త కమిటీ ఏర్పాటు చేయనున్నామని జైరాం చెప్పారు. ఈ కమిటీలో 2 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.
హైకోర్టు విభజన
రెండు రాష్ట్రాకు హైకోర్టులు ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రతిపాదనలు న్యాయశాఖకు పంపించామని చెప్పారు. న్యాయశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాత కొత్త హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం ప్రస్తుత హైకోర్టునే తెలంగాణ హైకోర్టుగా పరిగణించాలని, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతం ఉన్నదే ఉమ్మడిగా పనిచేయాల్సి ఉంటుంది. విభజన ప్రక్రియకు మార్గదర్శకాలను న్యాయశాఖ ఖరారు చేసిన తర్వాత హైకోర్టు విభజన ప్రారంభమవుతుంది.
ఐఏఎస్‌లకు ఆప్షన్స్ లేనట్లే!
అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఖరారు చేయడానికి ఏర్పాటయిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మంగళవారం సమావేశమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఈ భేటీకి హాజరయ్యారు. ఆప్షన్స్ సౌకర్యం కల్పించాలని అఖిల భారత అధికారులు కమిటీకి విన్నవించిన నేపథ్యంలో.. ఆప్షన్స్ ఇవ్వడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను సమావేశంలో చర్చించినట్లు తెలింది. ఆప్షన్స్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్నికల తర్వాత మార్గదర్శకాలను వెల్లడించడానికి కమిటీ కసరత్తు చేస్తోంది.