కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ వద్ద రోదిస్తున్న తల్లి, బంధువులు. (ఇన్‌సెట్లో) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జీవన్‌కుమార్ (ఫైల్)
హైదరాబాద్: కార్పొరేట్ కళాశాల సిబ్బంది వేధింపులతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దమ్మాయిగూడకు చెందిన సీహెచ్ హరిరామ్, సరిత దంపతుల రెండో కొడుకు జీవన్‌కుమార్(16) ఈసీఐఎల్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చూడటానికి కొంచెం లావుగా ఉండే జీవన్‌ను కళాశాల సిబ్బంది తరచు అవమానపరిచే వారని సహచర విద్యార్థులు ఆరోపించారు.
కళాశాల అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసే శ్రీకాంత్, లెక్చరర్ శ్రీలత.. జీవన్‌ను ఒళ్లు పెంచావ్ కానీ చదవడం రాదా? ఇంత తక్కువగా మార్కులు ఎందుకు వస్తున్నాయ్.. తిండి కొంచెం తగ్గించు అంటూ తోటి విద్యార్థుల ఎదుట అవమానించడమే కాక.. కొట్టడం, తిట్టడం చేశారని జీవన్ స్నేహితులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన జీవన్ పలుమార్లు సుసైడ్ చేసుకుంటా అని చెప్పినట్టు స్నేహితులు విలేకరులకు తెలిపారు.
ఈ క్రమంలో సోమవారం కళాశాల నుంచి ఇంటికి వచ్చిన జీవన్ ఆ రోజు రాత్రి 8:30 సమయంలో నాగారంలోని కృష్ణ థియేటర్ సమీపంలో విషం తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన జీవన్‌ను గమనించిన స్థానికులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు జీవన్‌ను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జీవన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.