'నన్ను చంపుకో.. ఫైట్ మాత్రం ఆగదు'
అహ్మదాబాద్: 'అమిత్ షా అవసరం అయితే మీ బలగాలతో దాడులు చేయించుకోండి.. చంపించుకోండి.. నేను పోతే నాలాంటివాళ్లు చాలామంది వస్తారు.. నేను బతికున్నంత వరకు పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్ సాధన ఉద్యమం మాత్రం ఆగదు' అని గుజరాత్లో పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్ కావాలని తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న యువ ఉద్యమ కెరటం హార్ధిక్ పటేల్ అన్నారు. దయచేసి తమ ఉద్యమంలో మాత్రం జోక్యం చేసుకోవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కోరారు. పటేళ్ల ఉద్యమం ఆపేయాలని అమిత్ షా చెప్పిన నేపథ్యంలో హార్థిక్ పటేల్ చాలా తీవ్రంగా స్పందించాడు.
బీజేపీ చీఫ్ చెప్పినంతమాత్రాన తమ ఉద్యమం ఆపేయాలా అని ప్రశ్నించాడు. 'పటేళ్లకు రిజర్వేషన్ల సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి దూరంగా ఉండమని నేను అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కోరినంత మాత్రానా మా ఉద్యమం ఆగదు. నేను బ్రతికున్న వరకు ఈ ఉద్యమాన్ని ఆపను. బలగాలతో మమ్మల్ని అణిచివేయాలని చూస్తే అదీ చేసుకోండి. అవసరం అయితే నన్ను చంపేసుకోండి. మీరు నన్ను చంపేసినా నాలాంటి ఎందరో హార్ధిక్ పటేళ్లు వస్తారు. మా డిమాండ్లు స్వీకరించేందుకు ప్రయత్నించండి మాకు న్యాయం చేయండి. అలా కాకుంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి' అంటూ పటేల్ అమిత్ షాకు సవాల్ విసిరారు.
తామేం హరెన్ పాండ్యా, అమిత్ జెత్వా, సంజయ్ జోషిలం కాదని చెప్పారు. అమిత్ షా ఎలా పనిచేస్తారో తమకు తెలుసని, అందుకే తమకు ధర్నాలు, నిరసనలు, సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం లేదని అననారు. అవసరం అయితే, బలగాల సాయంతో తమ ఉద్యమాన్ని తుదముట్టించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని, ఈ విషయం ముందే గ్రహించిన తాము ఆయన దయచేసి ఈ ఉద్యమంలో జోక్యం చేసుకోవద్దని చెప్తున్నామని పటేల్ బహిరంగంగా మీడియా ద్వారా అమిత్ షాకు స్పష్టం చేశాడు.