బీజేపీకి 'పటేల్' ఝలక్!
ముంబై: పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్ మంగళవారం బీజేపీకి గట్టి ఝలక్ ఇచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షమైన శివసేనతో ఆయన చేతులు కలిపారు. గుజరాత్‌లో శివసేన చీఫ్‌గా హార్దిక్ పటేల్ కొనసాగుతారని ఆ పార్టీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
హార్దిక్ పటేల్ మంగళవారం ముంబైలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ గుజరాత్‌లో శివసేన ప్రచార బాధ్యతలను హార్దిక్ నిర్వహిస్తారని, పార్టీ ప్రధాన నేతగా ఆయన ప్రజల్లోకి వెళుతారని చెప్పారు. గుజరాత్‌లో శక్తిమంతమైన పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ కల్పించాలంటూ పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరిట హార్దిక్ పటేల్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని బీజేపీ సర్కారు ఒకవైపు ప్రజా వ్యతిరేకతతోపాటు మరోవైపు పటేల్ ఆందోళన సెగను ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలో కేంద్రంలో, మహారాష్ట్రలోనే మిత్రపక్షంగానే కొనసాగుతూ.. గుజరాత్‌లో ఒంటరిగా పోటీచేస్తామని శివసేన ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకే ఉద్ధవ్-హార్దిక్ చేతులు కలిపినట్టు తెలుస్తోంది.