
మంత్రిగారి సరదా ఖరీదు.. కోటి రూపాయలు!
ఒలింపిక్స్‌కు వెళ్లిన తమ సొంత రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఓ మంత్రిగారు తన వంది మాగధులతో కలిసి బ్రెజిల్ వెళ్లాలని తలపెట్టారు. అందుకు అవుతున్న ఖర్చు అక్షరాలా కోటి రూపాయలు. ఆ విషయాన్ని ఆయనే వెల్లడించారు. హర్యానా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్ మొత్తం 9 మంది సభ్యులతో కలిసి రియో ఒలింపిక్స్ చూసేందుకు వెళ్తున్నారు. తన ప్రైవేటు కార్యదర్శి, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు, అదనపు ప్రధాన కార్యదర్శి (క్రీడలు), ఆయన ప్రైవేటు కార్యదర్శి, క్రీడాశాఖ సంయుక్త డైరెక్టర్.. వీళ్లంతా మంత్రిగారితో పాటు బ్రెజిల్ వెళ్తున్నారు. వీళ్లలో ఒక్కరు మాత్రం గతంలో హాకీ జాతీయ క్రీడాకారుడు. మిగిలిన ఎవ్వరికీ క్రీడల్లో ఏమాత్రం అనుభవం లేదు.
ఇప్పటికే కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ వెంట వెళ్లినవాళ్లు అక్కడ సిబ్బంది పట్ల అమర్యాదగా ప్రవర్తించారంటూ ఏకంగా గోయల్ అక్రిడేషన్ రద్దుచేస్తామని ఐఓసీ బెదిరించింది. ఇలాంటి తరుణంలో ఇలా జనాన్ని వెంటేసుకుని ఒలింపిక్స్ చూసేందుకు వెళ్లడం ఏంటని విమర్శలు తలెత్తుతున్నాయి. హర్యానాలో క్రీడాకారులకు ఏడు నెలలుగా స్టైపండ్ చెల్లించలేదు. ఓపక్క డబ్బు లేదని ఇలా చెల్లింపులు ఆపేసి, మరోపక్క మంత్రిగారి సరదాలు తీర్చుకోవడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తం తొమ్మిది మంది బృందంలో నలుగురు బిజినెస్ క్లాస్‌లోను, మిగిలిన ఐదుగురు ఎకానమీ క్లాస్‌లోను ప్రయాణం చేయనున్నారు. భారతదేశం నుంచి మొత్తం 119 మంది ఒలింపిక్స్‌కు వెళ్లగా, వారిలో అత్యధికంగా 20 మంది హర్యానావాళ్లే ఉన్నారు.