
ఆశారాం బాపూకు కోర్టులో చుక్కెదురు
జోథ్పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 3వ తేదీన డిఫెన్స్, ప్రాసిక్యూషన్ లాయర్ల వాదనలను పెండింగ్ లో ఉంచిన న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్జిత్ ఈ రోజు బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చుతూ తీర్పు చెప్పారు. గత వారం కోర్టుకు వచ్చిన ఆశారాం బెయిల్ పిటీషన్ పై రాం జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ఆశారాం చాలా కాలంగా జైలు జీవితం గడుపుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందును బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు తెలిపారు. అతనిపై దాఖలైన చార్జిషీట్ బలంగా ఉన్నందున బెయిల్ మంజూరు చేయకూడదని ప్రాసిక్యూషన్ కౌన్సిల్ తరుపున మిష్పాల్ బిస్నోయ్ వాదించారు.
72 ఏళ్ల ఆశారాం బాపూ సెప్టెంబర్ 2 నుంచి జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జోధ్‌పూర్ సమీపంలోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆగస్టు 20న ఆశారాం బాపుపై కేసు నమోదయింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఆశ్రమంలో అరెస్ట్ చేసి ఆయనను సెప్టెంబర్ 1న జోథ్పూర్కు తరలించారు.