![Daughter of high court judges driver ranks 66th in Rajasthan Judiciary Exams - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/24/Kartika-Gehlot-New.jpg.webp?itok=i634tJ-Q)
కార్తీక; తల్లిదండ్రులతో కార్తీక
పెద్దవాళ్లు, చుట్టుపక్కల వాళ్లు చేసేది చూసి పిల్లలు అనుకరిస్తుంటారు. కొంతమంది అనుకరణతో ఆగిపోకుండా వాళ్లలాగే తామూ ఎదగాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. ఈ కోవకు చెందిన అమ్మాయే 23 ఏళ్ల కార్తీక గెహ్లాట్. తండ్రి ఉద్యోగరీత్యా డ్రైవర్. న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడం ఆయన పని. చిన్నప్పటి నుంచి నాన్న నడిపే కారులో ఎంతో హుందాగా ఉండే న్యాయమూర్తులను దగ్గర నుంచి చూసిన కార్తీక తను కూడా జడ్జీ కావాలనుకుంది.
నేను పెద్దయ్యాక నల్లకోటు ఆఫీసర్ అవుతాను అని అనుకరించి చూపిస్తూండేది. అది చూసిన వారంతా చిన్నపిల్ల చేష్టలనుకునేవారు. కానీ నేడు కార్తీక జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో మంచి మార్కులతో 66 ర్యాంకు సాధించి పిల్లచేష్టలు కాదు, మరికొన్నేళ్లలో జడ్జి్జని కాబోతున్నానని చెప్పకనే చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జోద్‌పూర్‌కు చెందిన రాజేంద్ర గెహ్లాట్ ముద్దుల కూతురే కార్తీక గెహ్లాట్.
31ఏళ్లుగా ప్రధాన న్యాయమూర్తులెందరికో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు రాజేంద్ర. రాజస్థాన్ హైకోర్టులో పనిచేస్తున్న ఎంతోమంది జడ్జీలను, లాయర్లను చూస్తూ పెరిగిన కార్తీక తాను కూడా పెద్దయ్యాక జడ్జి కావాలనుకునేది. ఆరోతరగతిలో ఉండగా నల్లకోటు వేసుకుని న్యాయస్థానంలో పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆదిశగా అడుగులు వేస్తూ... జో«ద్‌పూర్‌లోని సెయింట్ ఆస్టిన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేసింది.
ఇంటర్మీడియట్ తరువాత జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో ఐదేళ్ల బిబిఏ.ఎల్‌ఎల్.బి. పూర్తిచేసింది. ఈ ఏడాదే డిగ్రీ పూర్తిచేసినప్పటికీ జడ్జీ అయ్యేందుకు 2019 నుంచి సన్నద్ధమవడం ప్రారంభించింది. ఒక పక్క సెమిస్టర్ పరీక్షల కోసం చదువుతూనే, మరోపక్క పిలిమినరీ, మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేది. కరోనా సమయంలో ఆఫ్‌లైన్ క్లాసులు అందుబాటులో లేకపోవడంతో, ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతూ సిలబస్ పూర్తిచేసింది.
ఇదే సమయంలో అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథూర్, జిల్లా సెషన్స్ జడ్జి మండల్ ప్రసాద్ బోహ్రాల వద్ద లా గైడెన్స్, అడ్వకేట్ ధర్మేంద్ర వద్ద ఏడాదిన్నరపాటు టెక్నికల్ గైడెన్స్, మాజీ ఐఏఎస్ అధికారి, తన మాజీ స్కూలు ప్రిన్సిపాల్ వంటివారందరి సలహాలు సూచనలతో రోజుకి నాలుగు గంటలు కష్టపడి చదివేది. పరీక్ష తేది ప్రకటించిన తరువాత ప్రిపరేషన్‌ను పది నుంచి పన్నెండు గంటలకు పెంచింది. సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అన్నింటికీ దూరంగా ఉండి తన లక్ష్యంపై దృష్టిపెట్టి రాజస్థాన్ జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో 66వ ర్యాంకు సాధించింది. దీంతో తన చిన్ననాటి కల జడ్జీ కావడానికి మొదటి అడుగు వేసింది.
నేను న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడాన్ని అప్పుడప్పుడు కార్తీక చూసేది. అలా చూస్తూ పెరిగిన ఆమె 12 ఏళ్ల వయసులో ఒకరోజు నేను కూడా త్వరలో నల్లకోటు వేసుకుని జడ్జిని అవుతానని చెప్పింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కార్తీక మాత్రం అప్పటి నుంచి జడ్జిఅవ్వాలన్న కలను నిజం చేసుకునేందుకు కష్టపడుతూనే ఉంది. వాళ్ల అమ్మకూడా∙తనని అన్ని విధాల సాయపడుతూ అండగా ఉండడంతో ఈ రోజు తన కలను సాకారం చేసుకుంది. ఏళ్లుగా ఎంతోమంది జడ్జీలను వెనుకసీట్లోకూర్చోపెట్టి తిప్పాను. భవిష్యత్‌లో నా కూతురు కూడా వారిలా వెనుకసీట్లో కూర్చోబోతున్నందుకు సంతోషంగా ఉంది.
– కార్తీక తండ్రి రాజేంద్ర గెహ్లాట్
పెళ్లికాదని భయపడుతున్నారు
చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లు లా చదువుతామంటే ఇష్టపడరు. లా చదివిన అమ్మాయిలకు పెళ్లిళ్లు కావు అని భయపడతారు. ఇలాంటి అపోహలు పోవాలంటే ప్రతి ఒక్కరికి చట్టం గురించిన ప్రాథమిక అవగాహన ఉండాలి. అప్పుడు తమ హక్కుల గురించి ధైర్యంగా పోరాడగలుగుతారు. నలుగురు సంతానంలో నేను ఒకదాన్ని. ప్రారంభంలో నా నిర్ణయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత కష్టపడి చదవడం చూసి ప్రోత్సహించారు. వారి సహకారంతో ఈ రోజు ఇంతమంచి ర్యాంకును సాధించగలిగాను. నన్ను ప్రేరణగా తీసుకుని నా తోబుట్టువులు సైతం లా చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నా ప్రిపరేషన్‌లో ఆన్‌లైన్ యాప్స్‌తో పాటు, ఏకాగ్రతతో చదవడానికి సంగీతం చాలా బాగా ఉపయోగపడ్డాయి.
– కార్తీక
Comments
Please login to add a commentAdd a comment