
మహిళలపై వ్యాఖ్యలకు నాన్న క్షమాపణలు చెప్పాలి: ఒమర్ అబ్దుల్లా
మహిళలపై నాన్న ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా క్షమాపణలు చెప్పాలని జమ్మూ మరియు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
జమ్మూ:మహిళలపై నాన్న ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా క్షమాపణలు చెప్పాలని జమ్మూ - కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మహిళలను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోరాదంటూ కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ మంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. తండ్రి వ్యాఖ్యలపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఒమర్.. ఈ వ్యాఖ్యలు మహిళల రక్షణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మహిళలపై ఫరూఖ్ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలు పంపకుండా ఉండాలంటే క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ వ్యాఖ్యలకు బ్లాగర్ల నుంచి విమర్శలు రావడంతో ఒమర్ స్పందించారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గంగూలీ, ఇతర ప్రముఖులు లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకోవటంపై శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ ఫరూక్ ఈ వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది. ‘ఓ మహిళను కార్యదర్శిగా నియమించుకోరాదని నేను భావిస్తున్నా. కర్మకాలి ఏదైనా ఫిర్యాదు దాఖలైందంటే మేం జైలు పాలు కావాల్సిందే’ అని పార్లమెంట్ భవనం వద్ద ఆయన మీడియాతో పేర్కొన్నారు.