మోదీతో సెల్ఫీ దిగితే తప్పేంటి: ములాయం కోడలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు అపర్ణా యాదవ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. లక్నో కంటోన్మెంట్ నుంచి ఎస్పీ తరపున బరిలోకి దిగిన అపర్ణ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలసి ప్రజల వద్దకు వెళ్లిన ఆమె రాజకీయ అనుభవమున్న నాయకురాలిగా అందర‍్నీ పలకరిస్తూ ఓటు వేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అపర్ణ మాట్లాడుతూ.. ములాయం కుటుంబమంతా కలసిమెలసి ఉందని చెప్పారు. తాను చిన్న మామయ్య శివపాల్ యాదవ్ వర్గంలో ఉన్నట్టు వచ్చిన వార్తలు నిరాధారమని, తామంతా ఒక్కటేనని, ఆయన పార్టీకి వెన్నెముక లాంటివారని అన్నారు. లక్నోలో ఓ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీతో ఇటీవల సెల్ఫీ దిగడాన్ని ఆమె సమర్థించుకున్నారు. ఇందులో తప్పేముందని, మోదీ అందరికీ ప్రధాని అని, తన మామ ములాయం కూడా ఆయనతో ఫొటోలు దిగారని చెప్పారు.
ములాయం పెద్ద కొడుకు అఖిలేష్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉండగా, కొడలు డింపుల్ యాదవ్ పార్లమెంట్ సభ్యురాలు. కాగా ములాయం రెండో కొడుకు ప్రతీక్ యాదవ్కు రాజకీయాలపై ఆసక్తిలేదు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నారు. ప్రతీక్ భార్య అపర్ణకు రాజకీయాలంటే ఆసక్తి. దీంతో తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తన భర్త వ్యాపారవేత్తని, రాజకీయాలపై ఆసక్తిలేదని అపర్ణ చెప్పారు. ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత రీటా బహుగుణ జోషీపై అపర్ణ పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ ఒక్కసారి కూడా గెలవని లక్నో కంటోన్మెంట్ నుంచి బలమైన ప్రత్యర్థితో పోటీపడుతున్న అపర్ణ.. సవాల్‌గా తీసుకుని ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.