హిల్లరీ క్లింటన్కు అస్వస్థత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ స్వల్ప అనారోగ్యానికి గురైయ్యారు. 9/11 మెమోరియల్ ఈవెంట్ లో పాల్గొన్న హిల్లరీ శరీర ఉష్ణోగ్రతలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడంతో ఆమె సిబ్బంది సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. న్యూయార్క్ లో నివసిస్తున్న తన కూతురు నివాసంలో ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. హిల్లరీ అక్కడ త్వరగా కోలుకుంటున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో హిల్లరీ ఆరోగ్య పరిస్ధితి అధ్యక్షపదవికి సరిపోదని అంటున్న రిపబ్లికన్ పార్టీ వాదనలకు ఆజ్యం పోసినట్లు అయింది. 68 ఏళ్ల హిల్లరి చాలా రకాల వ్యాధులతో బాధపడుతూ ఉండొచ్చని రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హిల్లరీ అనారోగ్యానికి గురికావడంపై ఆమె ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. ఆమె మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేశారు.
ఇకహిల్లరీ ఆరోగ్య పరిస్థితి రిపబ్లికన్స్ కు వరంగా మారే అవకాశం ఉందని అక్కడి రాజకీయ పండితులు అంటున్నారు. 47శాతం ఓట్లతో అధ్యక్షపదవి రేసులో ముందంజలో ఉన్న హిల్లరీకి ఆమె ఆరోగ్యం కారణంగా మూల్యం చెల్లించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా హిల్లరీకి న్యూమోనియా సోకినట్లు ఆమె వ్యక్తిగత డాక్టర్ తెలిపారు. దీంతో సోమవారం నిధుల సమీకరణ కోసం కాలిఫోర్నియాలో జరగనున్న సభను హిల్లరీ అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు.