ఇప్పటికిప్పుడు అణు యుద్ధం మొదలైతే..
'ఒకవేళ యుద్ధమే వస్తే ఇండియాపై అణుబాంబులేస్తాం' ఉడీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కు చెందిన కొందరు నాయకుల వ్యాఖ్యలివి. అయితే అణుయుద్ధానికి బదులు 'దౌత్యపరమైన యుద్ధం' చేసి పాకిస్థాన్ ను దెబ్బతీయాని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పట్లో యుద్ధం వచ్చే ఆలోచనగానీ, అవకాశాలుగానీ లేవని చెప్పకనే చెప్పింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేసిన కీలక వ్యాఖ్యలు గుర్తుచేసుకోవడం ఎంతైనా అవసరం.
'ఇప్పుడున్నట్లు కలకాలం శాంతి వర్ధిల్లుతుందా? ఏ దురదుష్టకరమైన రోజో అణుయుద్ధం మొదలుకాదా? అప్పుడు ఈ ప్రపంచం ఏమవుతుంది? అణుయుద్ధమేకాదు.. రోబొటిక్స్, బయోవెపన్స్ ఏదో ఒకనాటికి మనవాళిని అంతం చేయడం ఖాయం' అని హాకింగ్ అన్నారు. ఇతర గ్రహాల్లో కాలనీలు నిర్మించడం ద్వారానే మానవాళి మనుగడ సాధించగలదని నొక్కిచెబుతున్నారు. భూమ్మీద మానవ మనుగడ అంతరించడం తప్పదంటోన్న ఆయన ఇటీవల విడుదలైన 'How to Make a Spaceship' (అంతరిక్ష నౌకలు తయారుచేయడం ఎలా?) పుస్తకంలోనూ మళ్లీ అదే విషయాన్ని చెప్పారు. జూలియన్ గుథెరీ అనే జర్నలిస్టు రాసిన 'How to Make a Spaceship'కు ఉపంసంహారంగా హాకింగ్.. మానవజాతి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో బీబీసీ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ హాకింగ్ ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
(భూమిపై మానవ మనుగడ మరో వెయ్యేళ్లే: స్టీఫెన్ హాకింగ్)
ఉన్నపళంగా మొదలయ్యే అణుయుద్ధాలు, జెనెటికల్ వైరస్, ఇతర ఉత్పాతాల వల్ల భూమిమీద మానవజాతి అనేది లేకుండా పోతుందని నా నమ్మకం. మరోగ్రహం మీద ఆవాసం ఏర్పర్చుకోవడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం. అప్పుడు మాత్రమే విశ్వంలో మానవజాతి అనేదొకటి ఉంటుంది. మనకు ఎదురయ్యే ప్రమాదాలన్నీ టెక్నాలజీ పురోగతి వల్ల వచ్చేవే. అలాగని మనం అభివృద్ధిని అడ్డుకోలేం. మనల్నిమనం కాపాడుకునే మార్గాలు అణ్వేషించడం తప్పనిసరి అవసరం'అని హాకింగ్ అంటారు.
