ఇదే అత్తింటి నుంచి ఆఖరి ఫోన్
వెళ్లేసరికే కూతురు శవమైంది
గృహహింస చట్టం కింది శిక్షించాలి
శైలజ తల్లిదండ్రుల వినతి
విశాఖపట్నం: ‘మా అమ్మాయి ఆ రోజు ఉదయమే ఫోన్ చేసింది.. భర్త, ఆడపడుచులు చిత్రహింసలు పెడుతున్నారని, చంపేస్తారేమోనని భయం వ్యక్తం చేసింది.. మర్నాడు మేం వెళ్లే సమయానికి ఆమె ఉరి వేసుకొని చనిపోయినట్లు అత్తింటి వారు చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటే ఒంటిపై బలమైన గాయాలు ఎందుకుంటాయి..?’ అని శైలజ తల్లిదండ్రులు రౌతు అప్పారావు, అరుణ కన్నీటితో ప్రశ్నించారు. గత నెల 29న విజయనగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమ కుమార్తె కేసును గృహహింస చట్టం కింద విచారించాలని వారు శనివారం డీఆర్‌డీఏ కార్యాలయం శిశు సంక్షేమ శాఖలోని గృహహింస చట్ట విభాగంలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు సాక్షితో తమ ఆవేదన పంచుకున్నారు. వేపగుంట మండలం అప్పన్నపాలేనికి చెందిన రౌతు అప్పారావు, అరుణ 2012లో విజయనగరం జొన్నగుడ్డి ప్రాంతంలోని రెల్లివీధికి చెందిన ఎర్రంశెట్టి శ్రీనివాసరావుతో తమ కుమార్తె శైలజకు వివాహం జరిపించారు. రూ.2 లక్షల కట్నంతోపాటు 30 తులాల బంగారం దఫదఫాలుగా చదివించుకున్నారు. అయినా అదనపు కట్నం కోసం భర్త, ఆడపడుచులు వేధిస్తూ తమ కూతురిని చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. కొద్ది రోజుల క్రితం రూ.2 లక్షలు తేవాలంటూ భర్త వేధించడం మొదలుపెట్టాడని, పిల్లలు పుట్టలేదని ఆడపడుచుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయని తెలిపారు. భర్త, అత్తమామలు, ఆడపడుచులు చిత్రహింసలు పెట్టి చంపేసి, ఆత్మహత్యగా చిత్రించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ విజయనగరంలో ఒకటో పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ కుమార్తె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
నన్ను చంపేస్తారేమో..
Published Sun, Jul 12 2015 12:38 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement