వినికిడి లోపమని వదిలేశారు!
కాశీబుగ్గ(పలాస): వినికిడి లోపముందని భర్త ఆదరించకపోవడం, అదనపు కట్నం తేవాలని అత్తమామలు వేధించడంతో పలాస పట్టణంలోని ఉలాసపేటకు చెందిన గెంబలి సౌందర్య బుధవారం మౌనదీక్ష చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఉలాసపేటకు చెందిన సుడియా గౌతమ్‌తో విజయనగరం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన గెంబలి నారాయణ, శారదల కుమార్తె సౌందర్యతో 2016 డిసెంబరు 9న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదును కట్నంగా ఇచ్చారు.
నెల రోజుల తర్వాత సౌందర్యకు వినికిడి లోపం ఉన్నట్టు భర్త, అత్తమామలు గ్రహించారు. దీంతో గౌతమ్ తన భార్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య తనిఖీలు చేయించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమెను అక్కడే విడిచిపెట్టి బెంగళూరు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న సౌందర్య తల్లి దండ్రులు తన కుమార్తెను పార్వతీపురం తీసుకువచ్చారు. అక్కడి నుంచి వియ్యంకులకు ఫోన్ చేసి తమ కుమార్తెను తీసుకెళ్లాలని కోరారు.
అయినా స్పందించకపోవడంతో బుధవారం కుమార్తెతో కలిసి పలాస వచ్చి గౌతమ్ ఇంటి ముందే మౌనదీక్ష చేపట్టారు. ఈ సమయంలో అత్త రమాదేవి మౌన దీక్ష వహిస్తున్న సౌందర్యకు కిటికీలో నుంచి తిట్ల వర్షం కురిపించింది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లకపోతే ఏం జరుగుతుందో తెలియదని హెచ్చరికలు జారీ చేసింది. దిక్కుతోచని స్థితిలో సౌందర్య 100 నంబర్ కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలతో మాట్లాడగా అదనంగా మరో రూ.20 లక్షలు ఇచ్చి కాపురానికి పంపించాలని అత్త రమాదేవి చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు కాశీబుగ్గ పోలీసుల పరిశీలనలో ఉంది.