
రాజ్యాంగ పరిధికి లోబడి ఉమ్మడి రాజధాని: దిగ్విజయ్
రాజ్యాంగ పరిధికి లోబడి హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
న్యూఢిల్లీ: రాజ్యాంగ పరిధికి లోబడి హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆ అవకాశం రాజ్యాంగంలో ఉందని తెలిపారు. ఉమ్మడి రాజధానికి రాజ్యాంగ సవరణ అవసరంలేదన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సంబంధించి ఆంటోని కమటీ సీఫార్సులు జిఓఎంకు అందించినట్లు తెలిపారు. జిఓఎం ఈ రోజు నివేదిక సిద్ధం చేస్తుందని చెప్పారు. అన్ని అంశాలను జిఓఎం పరిశీలిస్తుందన్నారు. జిఓఎం నివేదిక కేంద్ర మంత్రి మండలి మందుకు వస్తుందని చెప్పారు. తెలంగాణ బిల్లు త్వరలో అసెంబ్లీకి ముందుకు వస్తుందన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని దిగ్విజయ్ చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేయడంలో తప్పులేదన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గౌరవిస్తారని చెప్పారు. సిడబ్ల్యూసి నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు.