
విపక్షానికి కాంగ్రెస్ ఎజెండా నిర్దేశించాలి
► జేడీయూ చీఫ్ నితీశ్ సూచన
► ప్రధాని రేసులో లేనని వెల్లడి
పట్నా: రాష్ట్రపతి అభ్యర్థి వ్యవహారంపై విపక్షాల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తాము మద్దతివ్వడాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌పై జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శలు సంధించారు. ‘కాంగ్రెస్ పెద్ద పార్టీ. విపక్షానికి ఎజెండా నిర్దేశించాలి.. విపక్షాలకు ఉమ్మడి ఎజెండా ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికలు ప్రధానంగా మారడంతో కీలకమైన రైతు సమస్యలపై దృష్టి తగ్గింది. విపక్షం ప్రభుత్వ చర్యలపై విమర్శలకు మాత్రమే పరిమితం కాకుం డా ప్రత్యామ్నాయ కార్యక్రమాలపై దృష్టి సారించాలి’ అని పిలుపునిచ్చారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను విపక్ష అభ్యర్థిగా ప్రధాని పదవి రేసులో ఉంటానని వచ్చిన వార్తలను నితీశ్ తోసిపుచ్చారు. ‘మాది చిన్న పార్టీ. ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెంచుకోవడం వ్యర్థం అని తెలుసు’ అని స్పష్టం చేశారు. రేసులో పేరు వినిపించే వ్యక్తికి ఆ పద వి ఎన్నడూ దక్కకపోవడం చూశామన్నారు. ఆయన సోమవారమిక్కడ ప్రజా దర్బార్ నిర్వహించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. అన్ని కోణాల్లో విస్తృతంగా చర్చించే కోవింద్‌కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకున్నారు.
రైతుల సమస్యలు, గోరక్షణ వివాదం వంటి సమస్యలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ సంక్షేమం కోసం ప్రజల వద్దకు వెళ్లడానికి ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమని పేర్కొన్నారు. ఆ ప్రత్యామ్నాయానికి మీరే ఎందుకు నాయకత్వం వహించకూడదు? అని అడగ్గా, ‘నేనేమైనా అత్యంత సమర్థుడినా?’ అని ఎదురు ప్రశ్నించారు. బిహార్‌లోని అధికార మహాకూటమి పటిష్టంగా ఉందని, విభేదాలు మీడియా సృష్టి మాత్రమేనన్నారు. ప్రభుత్వం తన ఏడు సూత్రాల కార్యక్రమానికి తొలి ప్రాధాన్యమిస్తుందన్నారు.