
ఎంపీకి ఆర్జేడీ షోకాజ్ నోటీసు
పట్నా: కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ మహ్మద్ తస్లీముద్దీన్ కు ఆర్జేడీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాని పదవికి నితీశ్ కుమార్ తగరని ఆయన వ్యాఖ్యానించారు. సొంత రాష్ట్రంలో శాంతిభద్రలు కాపాడలేని ఆయన ప్రధానమంత్రి పదవికి అనర్హుడని విమర్శించారు. ప్రధాని పదవి గురించి నితీశ్ మరిచిపోవాలని సలహాయిచ్చారు.
రాష్ట్రంలో అంతా బాగుందని అందరినీ నితీశ్ తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారని ఆరోపించారు. జేడీ(యూ)కు ఆర్జేడీ మద్దతు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి పదవి కోసం పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. బిహార్ లో హత్యలు పెరిగిపోయాయని, పాలన కుప్పకూలిందని తస్లీముద్దీన్ విమర్శించారు. నితీశ్ పై తీవ్ర విమర్శలు చేయడంతో తస్లీముద్దీన్ కు ఆర్జేడీ షోకాజ్ నోటీసు ఇచ్చింది.