నాకూ ప్రభుత్వం లేదు:ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో వరదలు భారీ విధ్వంసం సృష్టించడంతో ఆ రాష్ట్రంలో జన జీవనానికి పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అక్కడ ఆహార రవాణతో పాటు, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఇది కేవలం సామాన్య ప్రజలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గురువారం స్వయంగా వెల్లడించారు.'నాకు కూడా ప్రభుత్వం లేదు. వరదలతో రాష్ట్రం అంతా స్తంభించింది. ప్రస్తుతం నా ఇంట్లో విద్యుత్ లేదు. చివరకు నా సెల్ ఫోన్ కూడా పనిచేయడం లేదు' అంటూ ఆయన తాజాగా స్పష్టం చేశారు. తన గెస్ట్ హౌస్ నే సచివాలయంగా ఉపయోగిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాను అని తెలిపారు.
గత ఐదు రోజుల వరద పరిస్థితిపై రాష్ట్ర హోం మంత్రి అబ్దల్ రహీమ్ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించాని సీఎం తెలిపారు. 'రాష్ట్ర రాజధాని శ్రీనగర్ తో పాటు, నా ప్రభుత్వం కూడా పూర్తిగా మునిగిపోయింది. గత 36 గంటల నుంచి అసలు ప్రభుత్వ కార్యాకలాపాలన్నీ ఆగిపోయాయి'అని ఒమర్ స్పష్టం చేశారు. బుధవారం వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్‌ను ‘గో బ్యాక్’ నినాదాలతో అడ్డుకుని వెనక్కు పంపించిన సంగతి తెలిసిందే.