వరదల్లో వదిలేస్తారా... | Jammu and Kashmir Floods: Communication and Connectivity the Biggest Challenge, Says Army Chief | Sakshi
Sakshi News home page

వరదల్లో వదిలేస్తారా...

Published Thu, Sep 11 2014 1:46 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

వరదల్లో వదిలేస్తారా... - Sakshi

వరదల్లో వదిలేస్తారా...

సహాయ చర్యల్లో జాప్యంపై కాశ్మీరీల ఆగ్రహం
 
ఎన్‌డీఆర్‌ఎఫ్ జవానుపై దాడి
80 వేల మందిని రక్షించిన సైన్యం; ఇంకా లక్షల్లో సహాయార్థులు
బాధిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం
బాధితుల రక్షణలో తలమునకలైన త్రివిధ దళాలు
 

 
శ్రీనగర్: కాశ్మీర్‌లోయలో వరద తీవ్రత కాస్త తగ్గింది. దాంతో రక్షణ చర్యలను సహాయ బృందాలు మరింత ముమ్మరం చేశాయి. అయితే వారం రోజులుగా వరద నీటిలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలు.. సహాయక చర్యల్లో జరుగుతున్న జాప్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు ఆహారం, తాగునీరు, ఔషధాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ సహాయ బృందాలపై దాడులకు దిగుతున్నారు. శ్రీనగర్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్ జవానుపై స్థానికులు దాడి చేయడంతో ఆయన గాయాల పాలయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ సహాయ బృందాలను అడ్డుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్‌ను ‘గో బ్యాక్’ నినాదాలతో అడ్డుకుని వెనక్కు పంపించారు. ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నానని బుధవారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ఇది చాలా కష్ట సమయం. వారి కోపాన్ని అర్థం చేసుకోగలను. వరద ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గుతోంది. కానీ అపరిశుభ్రత కారణంగా ఇక అంటువ్యాధులు విజృంభిస్తాయేమోనని భయపడుతున్నాను’ అన్నారు.

తన ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదనే విమర్శను మాత్రం అంగీకరించబోనన్నారు. ‘వర్షాలు ప్రారంభం కావడానికన్నా ముందే.. భారీ వర్షాలు రానున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని మసీదుల ద్వారా, పోలీస్ స్టేషన్ల ద్వారా హెచ్చరించాం. వాటినెవరూ పట్టించుకోలేదు’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.  మరోవైపు జమ్మూకాశ్మీర్‌లో రక్షణ, సహాయ చర్యలలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన తోడ్పాటును వెంటనే అందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆహారం, తాగునీరు వంటి నిత్యావసరాలను తక్షణమే అందించడానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. వరద ప్రభావ ప్రాంతాల్లో పారిశుధ్య ఏర్పాట్లు వెంటనే చేయాలన్నారు. కాశ్మీర్‌లో జరుగుతున్న సహాయ చర్యలపై బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమీక్షాసమావేశంలో ఆయన పాల్గొన్నారు.

వరద బాధిత ప్రాంతాల నుంచి బుధవారం 32,500 మందిని సహాయ దళాలు రక్షించాయి. దాంతో ఇప్పటివరకు దాదాపు 80 వేల మందిని రక్షించినప్పటికీ.. ఇంకా ఐదారు లక్షల మంది ప్రజలు వరద ప్రాంతాల్లో చిక్కుకునే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆహారం, నీళ్లు ఇవ్వమంటూ రావల్పోరాలో మీనా అహ్మద్ అనే మహిళ వేడుకోవడం కనిపించింది.   {పపంచంలోనే పెద్దదైన ఎంఐ 26టీ హెలికాప్టర్ సహా 80 రవాణా చాపర్లు, విమానాలను, 30వేల సైనిక దళాలను సహాయ చర్యల్లో వినియోగిస్తున్నారు. వరద జలాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంతో పాటు బాధితులకు ఆహారం, ఔషధాలు, నీరు అందించడంలో వీరు నిమగ్నమయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ కూడా తమ సహాయ చర్యలను తీవ్రం చేసింది.

{తివిధ దళాలు పూర్తిస్థాయిలో సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం చీఫ్ ఓపీ సిన్హా  శ్రీనగర్ చేరుకున్నారు.బాధితులందరికీ సాయం అందేవరకు తమ దళాలు రాత్రింబవళ్లు పనిచేస్తాయని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ చెప్పారు. రెండు మూడు రోజుల్లో పరిస్థితులు మెరుగుపడొచ్చని అన్నారు.ఎన్‌డీఆర్‌ఎఫ్ జవానుపై స్థానికుల దాడి నేపథ్యంలో వరద సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్న బృందాలకు రక్షణగా సీఆర్‌పీఎఫ్ దళాలను పంపాలని నిర్ణయించారు. అయితే, పడవల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్లను కూడా పంపితే.. బాధితుల కోసం పడవల్లో స్థలం తక్కువయ్యే అవకాశముండటంతో ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్నారు.

నగర్‌లోని రాజ్‌బాగ్, జవహర్‌నగర్, గోగ్జీ బాగ్, శివ్‌పోరా ప్రాంతాల్లో వేలాది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయి ఉన్నారు.జమ్మూకాశ్మీర్‌లో గత 109 ఏళ్లలో ఇదే అతిపెద్ద జల విపత్తు.   సమాచార వ్యవస్థను పునరుద్ధరించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన మొబైల్ నెట్‌వర్క్‌ను కార్గిల్ నుంచి శ్రీనగర్‌లోని బాదామీ బాగ్‌కు మార్చారు.   విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 270 మందిని వరద ప్రాంతాల నుంచి శ్రీనగర్‌కు ఉచితంగా తరలించింది. శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులను ఢిల్లీకి తరలించేందుకు ఎయిరిండియా, స్పైస్‌జెట్, జెట్‌ఎయిర్‌వేస్, గోఎయిర్ విమానయాన సంస్థలు అదనపు విమానాలను నడుపుతున్నాయి.నగర్ నుంచి ఢిల్లీకి టికెట్ ధరను గరిష్టంగా రూ. 2800, లేహ్ నుంచి ఢిల్లీకి గరిష్టంగా రూ. 3 వేలుగా డీజీసీఏ నిర్ణయించింది. డబ్బులు లేనివారి నుంచి ఢిల్లీ చేరుకునేంతవరకు టికెట్ డబ్బులను వసూలు చేయొద్దని ఎయిర్‌లైన్స్ సంస్థలను ఆదేశించింది.

లేహ్‌లో దాదాపు 200 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. వారిని ఉచితంగా ఢిల్లీకి తీసుకురావాలని డీజీసీఏ జెట్ ఎయిర్‌వేస్, గో ఎయిర్ సంస్థలను ఆదేశించింది. కాశ్మీర్ వరదల్లో చిక్కుకుపోయినవారి కోసం గూగుల్ సంస్థ ప్రారంభించిన డేటాబేస్ యాప్ ‘పర్సన్ ఫైండర్’లో ఇప్పటివరకు 3,200 మంది బాధితుల వివరాలు పొందుపర్చామని గూగుల్ తెలిపింది.  ఈ విపత్తు కారణంగా జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు వాయిదాపడే అవకాశాలున్నాయి. బుధవారంనుంచి రెండు రోజులు జమ్ము కాశ్మీర్‌లో పర్యటించవలసిన ఎన్నికల కమిషన్ (ఈసీ) తన పర్యటనను వాయిదా వేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే అంశంపై కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎన్నికల కమిషన్ అధికారి చెప్పారు. జమ్ము కాశ్మీర్ ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో ముగుస్తుంది.
     
సెంట్రల్ కాశ్మీర్, దక్షిణ కాశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లోని 20 చిన్న, పెద్ద ఆర్మీ క్యాంపులు ప్రస్తుతం వరద ముప్పులో చిక్కుకున్నాయి. ఆ క్యాంపుల్లోని దాదాపు 1000 మంది జవాన్లు, వారి కుటుంబ సభ్యులు వరదల్లో చిక్కుకుపోయారు. తిండి, నీరులేక అలమటిస్తున్నారు.సోషల్ నెట్‌వర్క్ ద్వారా తమకందిన సమాచారం ఆధారంగా శ్రీనగర్‌లో వరదల్లో చిక్కుకుపోయిన ఓ ఇంట్లో నుంచి ఒక తొమ్మిది నెలల గర్బిణిని బుధవారం ఆర్మీ రక్షించింది. ఆ ఇంట్లో నుంచి కొద్ది దూరం పడవలో, అనంతరం హెలీకాప్టర్‌లో ఆమెను ఆర్మీ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ అర్షిదా అనే ఆ యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది.సాయం కోరుతూ ఆర్మీ వెబ్‌సైట్‌కు దాదాపు 15 వేల సందేశాలు వచ్చాయని అదనపు డీజీ షోకిన్ చౌహాన్ తెలిపారు.
 
రష్యా మహిళల ధైర్యం
 
తాము ఆపదలో ఉన్నా ఆ రష్యా మహిళలిద్దరూ ఎంతో ధైర్యం కనబరిచారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న శ్రీనగర్‌లోని ఓ హోటల్‌లో ఉన్న వారిద్దరూ,.. తమను రక్షించడానికి వచ్చిన సైనిక జవాన్లు, వాయుసేన సిబ్బంది ముందు అసమాన ధీరత్వాన్ని, సేవాగుణాన్ని కనబరిచారు. తమకంటే దుర్బలమైన స్థితిలో అనారోగ్యంతో ఉన్నవారిని ముందుగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని, ఆ తర్వాతే తాము బయటకు వస్తామన్నారు. అలాగే బాధితుల్లో చివరి వ్యక్తిని తరలించేవరకూ వారు ధైర్యంగా అక్కడే ఉండిపోయారు. సహాయక చర్యల్లో, బాధితుల తరలింపులో సైన్యానికే మార్గదర్శకంగా నిలిచారు.
 
 
వడోదరలో వరదలు
 
వడోదర: గుజరాత్‌లోని వడోదర నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల వల్ల విశ్వామిత్రి నది నీటిమట్టం పెరడగంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. నగర పశ్చిమ ప్రాంతంలో చాలా చోట్ల వరదనీరు చేరింది. 2 లక్షలమంది అష్టకష్టాలు పడుతున్నారు. బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లు, మంచి నీరు అందించేందుకు సాయం చేయాలని నగర మునిసిపిల్ కార్పొరేషన్ సైన్యానికి విజ్ఞప్తి చేసింది. వరద ప్రాంతాల నుంచి మంగళవారం 1,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు బుధవారం మరో 200 మందిని తరలించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement