
నేను పాకిస్థాన్‌లో జన్మించినా.. : అద్వానీ
పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించానని, అయితే క్రమశిక్షణను, విద్యను ఆర్‌ఎస్ఎస్ నుంచి నేర్చుకున్నానని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ అన్నారు.
మౌంట్ అబు (రాజస్థాన్): పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించానని, అయితే క్రమశిక్షణను, విద్యను ఆర్‌ఎస్ఎస్ నుంచి నేర్చుకున్నానని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ అన్నారు. జీవితంలో ఎప్పుడూ తప్పులు చేయకూడదని ఆర్‌ఎస్‌ఎస్ నుంచే నేర్చుకున్నానని, అలాగే అంకితభావం, నిబద్ధతతో దేశాన్ని అభివృద్ధి చేయడం గురించి తెలుసుకున్నానని చెప్పారు.
ఆదివారం రాజస్థాన్‌లోని మౌంట్ అబులో జరిగిన బ్రహ్మకుమారీల 80వ వార్షిక వేడుకల్లో అద్వానీ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అద్వానీతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, పలువురు కేంద్రమంత్రులు, గవర్నర్లు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
1927 నవంబర్ 8న పాకిస్థాన్‌లోని కరాచీలో అద్వానీ జన్మించారు. కాగా దేశ విభజన తర్వాత పాక్‌లో మత ఘర్షణలు జరిగిన సమయంలో అద్వానీ కుటుంబం భారత్‌కు వచ్చింది.