సీఎం హామీ ఇస్తే సమ్మె విరమిస్తాం: అశోక్‌బాబు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇస్తే సమ్మెను విరమిస్తామని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. లేదంటే పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమైక్యంపై సీఎం హామీ ఇస్తే.. ఆ హామీని ఎలా నిలబెట్టుకుంటారనే విషయంపై కూడా వివరణ అడుగుతామన్నారు. మంగళవారం ఏపీఎన్జీవో భవన్‌లో అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు సాధారణ పరిపాలన విభాగం అధికారుల నుంచి పిలుపు వచ్చిందని అశోక్‌బాబు తెలిపారు. 17న మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు వస్తామని తాము తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం పరిశీలించబోయే అంశాల్లో ఉద్యోగుల సమస్యలు కూడా ఉన్నందున.. దానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమను కోరారని చెప్పారు. రెండు మూడ్రోజుల్లో నివేదిక ను సీఎస్‌కు అందజేస్తామన్నారు.
తెలంగాణ ఎమ్మెల్యేలను కలుస్తాం
రాష్ట్ర విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని సీమాంధ్ర జిల్లాల్లోని దాదాపు అందరు (ఐదుగురు మినహా) ఎమ్మెల్యేలూ డిక్లరేషన్ ఇచ్చారని అశోక్‌బాబు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలను కలిసి డిక్లరేషన్ కోరతామన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలనూ కలిసి రాష్ట్రాన్ని ఎందుకు సమైక్యంగా ఉంచాలో వివరిస్తామన్నారు. త్వరలో డీఎంకే, ఏఐడీఎంకే నేతలను కలిసి విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరతామన్నారు.
జాతీయ నాయకుల మద్దతు కోరేందుకు నెలాఖర్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు అశోక్‌బాబు తెలిపారు. తుపాను సమయంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు సమ్మెలో ఉండే(జీతాలు తీసుకోకుండా) సేవలందించారని అశోక్‌బాబు తెలిపారు. ఆ తరువాత శ్రీకాకుళం జిల్లా ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా సమ్మెలోనేఉన్నారన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ఆర్టీసీ, ఉపాధ్యాయ, విద్యుత్ జేఏసీ సమ్మె విరమించాయని ప్రభుత్వం అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.