ముఖ్యమంత్రిని ఉంచుతారో.. తొలగిస్తారో తెలియట్లేదు: అశోక్బాబు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తున్న హామీలు నమ్మాలంటే అసలు ఆయనను ముఖ్యమంత్రిగా ఉంచుతారో, తొలగిస్తారో తెలియట్లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు మంగళవారం హైదరాబాద్లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో గురువారం చర్చించిన తర్వాత సమ్మె కొనసాగించాలా.. వద్దా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రితో చర్చలపై రేపు, ఎల్లుండి ఏపీఎన్జీవోలు, జేఏసీ నేతల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
పై-లీన్ తుఫాను సందర్భంగా సహాయ, పునరావాస కార్యక్రమాలకు హాజరైన ఉద్యోగులంతా మళ్లీ సమ్మెలోకి చేరారని అశోక్ బాబు తెలిపారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకునే ఉపాధ్యాయులు, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందిగా తెలంగాణ ఎమ్మెల్యేలను కలసి కోరతామని పి.అశోక్బాబు వెల్లడించారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా తాము చివర వరకు పోరాడతామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా.. ప్రభుత్వ వ్యవస్థలపై సమ్మె ప్రభావం అలానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్లన్నింటినీ రెండు మూడు రోజుల్లో సీఎస్కు నివేదిస్తామన్నారు. న్యూఢిల్లీ వెళ్లి మరోసారి జాతీయ నాయకులను కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరనున్నట్లు అశోక్బాబు వెల్లడించారు.