'2014 వరకు విభజన జరిగే ప్రసక్తే లేదు'
హైదరాబాద్: 2014 వ సంవత్సరం వరకు రాష్ట్ర విభజన జరిగే ప్రసక్తే లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజల నిర్ణయంపైనే విభజన ప్రక్రియ ఆధారపడి ఉంటుందని తెలిపారు. సమైక్యవాణిని వినిపించే రాజకీయ నేతనే ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన అశోక్ బాబు కేంద్ర మంత్రులపై మండిపడ్డారు. సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయిన విభజన బిల్లుకు సహకరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండి చేస్తామని హెచ్చరించారు. మంత్రులు కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ గెలవాలనుకుంటే అది వారి పిచ్చితనమే అవుతుందన్నారు. సమైక్యాంధ్ర కోరుకునే వారిని గెలిపించి సీమాంధ్రుల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాలన్నారు.
ఈ నెల 24వ తేదీన తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. పదకొండ వివాదాస్పద అంశాలకు పరిష్కారం చూపించాలంటే 100 ఉల్లంఘనలు జరగాలని, అందువల్ల రాష్ట్ర విభజన సాధ్యం కాదన్నారు.