![అక్కడ అక్రమ మైనింగ్ సాధారణమే: మంత్రి](/styles/webp/s3/article_images/2017/09/3/61440669084_625x300.jpg.webp?itok=qlNZY88e)
అక్కడ అక్రమ మైనింగ్ సాధారణమే: మంత్రి
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల మధ్య సరిహద్దులు అంత స్పష్టంగా లేకపోవడంతో.. ఆ పరిస్థితిని ఉపయోగించుకుని అక్రమ మైనింగ్ ఇష్టారాజ్యంగా సాగుతోంది. చక్కి నది పొవునా ఇది కొనసాగుతోందని హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి కౌల్ సింగ్ తెలిపారు. పంజాబ్కు చెందిన ఈ అక్రమ మైనింగ్ మాఫియా పెద్దలు హిమాచల్ ప్రదేశ్ వాసులను విపరీతంగా వేధిస్తున్నారని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ఈ విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
పంజాబ్ సర్కారు నిర్ణయం కోసం ఇంకా తాము వేచిచూస్తున్నామన్నారు. నిజానికి 2005 నుంచి ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం మీద చర్చలు నడుస్తున్నాయి. 2012 ఏప్రిల్ నెలలో దీనిపై అసెంబ్లీలో ఘాటు చర్చలు జరిగాయి. రాష్ట్రంలోని నూర్పూర్ ప్రాంతంలో మైనింగ్ మాఫియా కార్యకలాపాలు మరీ ఎక్కువైపోవడంతో స్వతంత్ర సభ్యుడు రాకేష్ పఠానియా తాను స్వయంగా తుపాకి పట్టుకుని అక్కడ పోరాడతానని అప్పట్లో అసెంబ్లీలో హెచ్చరించారు. అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 200 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది.