‘ట్వెల్త్’లోనే ఫస్ట్ బాంబ్!
*పాఠశాల రసాయనాలతో తయారు చేసిన ఆఫ్రిదీ
* ఎనిమిదేళ్ల కాలంలో నాలుగు రాష్ట్రాల్లో మకాం
*ఒక్కోచోట ఒక్కో వత్తిలో కొనసాగిన వైనం
* రెండుసార్లు హైదరాబాద్‌కు రాకపోకలు
సాక్షి: దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ‘జుందుల్ అల్ ఖలీఫా ఏ హింద్’ సంస్థ ఫైనాన్స్ చీఫ్, నగరంలోని టోలిచౌకికి చెందిన నఫీజ్‌ఖాన్‌ను ‘గురువు’గా వ్యవహరించిన ఆలమ్ జెబ్ ఆఫ్రిదీ మహా ముదరని నిఘా వర్గాలు చెప్తున్నాయి. 2008 నాటి అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో అక్కడి క్రై మ్ బ్రాంచ్ పోలీసులు ఆఫ్రిదీని గత నెల కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే తొలి బాంబు తయారీ నుంచి ఎనిమిదేళ్ల తన ‘ప్రస్థానం’లో వేసిన ‘వేషాల’ వరకు అన్నీ బయటపెట్టాడు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జోహాపుర న్యూ ఆషియానా పార్క్‌కు చెందిన ఆలమ్ జెబ్ అఫ్రిదీ అక్కడి వెజల్పూర్‌లోని ద రేన్ స్కూల్‌లో 11-12 తరగతులు చదివాడు. ట్వెల్త్ క్లాస్‌లో ఉండగా స్కూల్ కెమిస్ట్రీ లాబొరేటరీ నుంచి కొన్ని రసాయనాలు తస్కరించాడు. వీటితో పాటు అగ్గిపుల్లలకు ఉండే పచ్చభాస్వరం ఉపయోగించి అప్పట్లోనే ఓ బాంబు తయారు చేసి, జోహాపురలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి పేల్చడం ద్వారా పరీక్షించానని క్రై మ్‌బ్రాంచి విచారణలో అఫ్రిదీ వెల్లడించాడు.
నాలుగు వత్తుల్లోనూ సక్సెస్...
నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ద్వారా ఉగ్రవాద బాట పట్టిన ఆఫ్రిదీ ఆపై ఇండియన్ ముజాహిదీన్‌లో (ఐఎం) కీలకపాత్ర పోషించాడు. 2008 జూలై 26న అహ్మదాబాద్‌లోని డైమండ్ మార్కెట్‌లో పేలుడుకు పాల్పడే సమయానికి ఆఫ్రిదీ అక్కడి ఓ ఆస్పత్రిలో టెలిఫోన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ విధ్వంసం తర్వాత ఫారూఖాబాద్‌లోని తన స్నేహితుడి ఇంట్లో ఎక్స్-రే టెక్నీషియన్‌గా తలదాచుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఐఎం మాడ్యుల్ గుట్టురట్టు కావడంతో అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయింది. కాన్పూర్‌లో ఇసుక కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. అక్కడ ఎక్కువ రోజులు ఉండటం సేఫ్‌కాదని మహారాష్ట్రలోని అమ్రావతికి వెళ్లి సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. ఆపై హర్యానాకు వెళ్లిన ఆఫ్రిదీ షాజహాన్‌పూర్‌లోని ఓ హైవే దాబాలో పని చేశాడు. మళ్లీ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి... మేవాట్ ప్రాంతంలోని స్వీట్‌షాప్‌లో కార్మికుడిగా చేరాడు. ఆ సమయంలో బెంగళూరుకు చెందిన కొందరితో పరిచయం ఏర్పడి.. తన మకాం కర్ణాటకకు మార్చాడు. బెంగళూరులోని వినాయకనగర్‌లో మహ్మద్ రఫీఖ్ పేరుతో ఏసీ మెకానిక్‌గా మారాడు.
చెయ్యేస్తే ఏసీ పని చేయాల్సిందే...
పరప్పన అగ్రహార ప్రాంతంలోని ఓ ఏసీ సర్వీస్ సెంటర్‌లో ఆఫ్రిదీ ఏసీ మెకానిక్‌గా చేరాడు. ఆరు నెలలకు ‘ఉద్యోగానికి రాజీనామా’ చేసి సొంతంగా పని ప్రారంభించాడు. దీంతో పాత యజమాని కై ్లంట్స్ అంతా ఇతడి వద్దకు వచ్చేవారు. దీంతో తన వ్యాపారం దెబ్బతినడంతో పాతయజమాని 2013లో పది మంది కిరాయి మనుషులతో అఫ్రిదీని కొట్టించాడు. దీంతో అఫ్రిదీ పోలీసులకు ఫిర్యాదు చేసి వారందరినీ అరెస్టు చేయించాడు. 2015లో బెంగళూరులోని ఎంబీ రోడ్‌లోని ఇజ్రాయిల్ వీసా సెంటర్‌కు నిప్పుపెట్టాడు. పోలీసులకు చిక్కుతాననే భయంతో సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరేందుకు సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు జరిపాడు.
రెండుసార్లు నగరానికీ ‘టూర్’....
సిరియా కేంద్రంగా ఐసిస్‌కు ఇండియా చీఫ్‌గా వ్యవహరిస్తున్న షఫీ ఆర్మర్‌కు సన్నిహితుడిగా మారాడు. సిరియా వచ్చే ముందు ‘జుందుల్’ మాడ్యుల్‌కు శిక్షణ ఇవ్వాల్సిందిగా అతడు చెప్పడంతో సోషల్‌మీడియా ద్వారానే నగరానికి చెందిన నఫీస్ ఖాన్‌ను సంప్రదించాడు. తొలిసారిగా గతేడాది టోలిచౌకి వచ్చి అతడిని కలిసి వెళ్లాడు. ఆ సమయంలో ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, శిక్షణ, లావాదేవీలు తదితర అంశాలను చర్చించాడు.
విధ్వంసాలకు అవసరమైన బాంబుల్ని తయారు చేసే ప్రయత్నాల్లో భాగంగా నఫీస్ ఖాన్ ‘స్థానిక పదార్థాల’తోనే నాలుగు బకెట్ బాంబుల్ని రూపొందించాడు. ఇవి పేలడానికి అవసరమైన డిటోనేటర్లును తయారు చేయడం మాత్రం ఇతడి వల్లకాలేదు. దీంతో నఫీస్ బాంబుల తయారీలో నిష్ణాతుడైన అఫ్రిదీ సహాయం కోరాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరిలో మరోసారి హైదరాబాద్ వచ్చిన అఫ్రిదీ... రసాయనాలు వినియోగించి డిటోనేటర్లు ఎలా తయారు చేయాలనే అంశాన్ని ‘బోధించి’ వెళ్లాడు. ఈ ప్రయత్నాలు కార్యరూపంలోకి రాకముందే ‘జుందుల్’ మాడ్యుల్‌తో పాటు అఫ్రిది సైతం చిక్కాడు.