పాకిస్థాన్‌పై రగిలిపోతున్న పీవోకే!
ముజఫరాబాద్: పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ పాల్పడుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు ఆందోళన బాట పట్టారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న కశ్మీర్ ఆజాదీ నేతల బూటకపు ఎన్‌కౌంటర్లు, అక్రమ హత్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఆర్మీ, ఐఎస్‌ఐ కూడబల్కుకొని ఈ హత్యలు చేస్తున్నాయంటూ పీవోకేలోని కోటిల్ వాసులు ఇటీవల భారీ ఆందోళన నిర్వహించారు.
‘కశ్మీర్‌ను ముక్కలు చేసిన కసాయి పాకిస్థాన్ ఆర్మీ’, ‘ఐఎస్‌ఐ కన్నా కుక్కలు విధేయంగా ఉంటాయి’ అంటూ ఈ సందర్భంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కశ్మీరీ జాతీయవాద ప్రధాన నేత ఆరిఫ్ షాహిద్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష జాతీయ కూటమి (ఏపీఎన్‌ఏ) చైర్మన్, జమ్మూకశ్మీర్ జాతీయ విముక్తి కాన్ఫరెన్స్ (జేకేఎన్‌ఎల్సీ) అధ్యక్షుడు అయిన 60 ఏళ్ల షాహిద్ 2013 మే 14న రావాల్పిండిలో తన ఇంటి ఎదుట హత్యకు గురయ్యారు. పీవోకేలో పాక్ అణచివేతను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయనను ఐఎస్‌ఐ కుట్రపూరితంగా చంపిందని ఆరోపణలు ఉన్నాయి. ముజఫరాబాద్‌లోని అఖిలప జాతీయ కూటమి లెక్కల ప్రకారం దాదాపు వందమంది కశ్మీర్ ఆజాదీ అనుకూల రాజకీయ కార్యకర్తలను పాక్ కిరాతకంగా హతమార్చిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీవోకేలో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.