
'క్షమాపణ చెప్పను... అది నా హక్కు'
న్యూఢిల్లీ: ఎంపీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఫేస్ బుక్ లో తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడివున్నట్టు తెలిపారు. పార్లమెంట్ నోటీసులుకు ఆయన సమాధానం ఇచ్చారు. తన అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించే హక్కు తనకు ఉందని పేర్కొన్నారు.
పార్లమెంట్ అంటే ఎంతో గౌరవం ఉందని, పార్లమెంట్ ను తాను అగౌరవపరచలేదని అన్నారు. వాద్రా వివాదాన్ని ఇంతటితో ముగించాలా లేదా ప్రివిలేజ్ కమిటీకి విన్నవించాలా అనే దానిపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకోనున్నారు.
'పార్లమెంట్ సమావేశాలు మళ్లీ మొదలవుతున్నాయి. విషయాలను పక్కదారి పట్టించే రాజకీయ ఎత్తుగడలు వేసుకోనివ్వండి. ప్రజలు ఏమీ తెలివి తక్కువవాళ్లు కాదు. ఇలాంటి నాయకుల నాయకత్వంలో దేశాన్ని చూడాల్సి రావడం బాధకరమ'ని ఫేస్ బుక్ లో వాద్రా పోస్ట్ చేశారు. దీనిపై అధికార బీజేపీ మండిపడింది. లోక్ సభలో బీజేపీ చీఫ్ విప్ అర్జున్ రామ్ మేఘవాల్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.