
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమాస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన క్రమంలో తానెలాంటి తప్పూ చేయలేదని వాద్రా ఆదివారం పేర్కొన్నారు. ఈడీ తనను ప్రశ్నించిన ఉదంతంపై స్పందించిన వాద్రా చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, మద్దతుదారులకు ధన్యవాదాలని, తాను ధైర్యంగా, క్రమశిక్షణతో దేన్నైనా ఎదుర్కొంటానని వాద్రా ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
మనీల్యాండరింగ్ కేసులో వాద్రాను ఈనెల 6, 7 తేదీల్లో విచారించిన ఈడీ శనివారం మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది. వాద్రా లండన్‌లో వరుసగా 5 మిలియన్ పౌండ్లు, 4 మిలియన్ పౌండ్ల విలువ చేసే రెండు ఇళ్లను, ఆరు ఫ్లాట్స్, ఇతర ఆస్తులను కొనుగోలు చేశారని, వీటిలో కొత్తగా చేజిక్కించుకున్న ఆస్తులు సైతం ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు నివేదించింది. కాగా తనకు విదేశాల్లో అక్రమాస్తులు లేవని, రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై దాడులు చేస్తున్నారని వాద్రా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment