ఉల్లి@రూ.40
రోజురోజుకూ ఘాటెక్కుతున్న ధర
పది రోజుల్లోనే రూ. 15 మేర పెరిగిన రేటు
ఇదే అదనుగా వ్యాపారుల అక్రమ నిల్వలు
హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ ఉల్లి ఘాటు పెరుగుతోంది. వంటింటికి చేరకముందే కన్నీళ్లు తెప్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులతో సాగు చతికిలపడడం, వరదల కారణంగా మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో ధర కొండెక్కి కూర్చుంది. మార్కెట్‌లో గ్రేడ్ వన్ రకం ఉల్లి కిలో ధర రూ.40కి పైనే పలుకుతోంది. రేట్లు ఇప్పట్లో దిగొస్తాయన్న ఆశ కూడా కనిపించడం లేదు. వ్యాపారుల అక్రమ నిల్వలు సైతం ధరల పెరుగుదలకు కారణమవుతోంది.
తగ్గిన సాగు విస్తీర్ణం..
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లి సాగు గణనీయంగా తగ్గింది. మొత్తంగా 10 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతుందని భావించగా.. ఇప్పటి వరకు కేవలం 25 శాతం అంటే 2.5 వేల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 5 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగు జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిని అధికంగా సాగు చేసే కర్నూలు జిల్లాలో సైతం పరిస్థితి ఆశాజనకంగా లేదు. రాష్ట్రానికి 90 శాతం మేర ఉల్లిని సరఫరా చేసే మహారాష్ట్రలో ఈ సంవత్సరం 30 వేల ఎకరాల్లో సాగు జరిగినా.. ఇటీవలి వర్షాల కారణంగా పంట దెబ్బతింది. ఫలితంగా అక్కడ్నుంచి 20 నుంచి 30 శాతం మేర సరఫరా తగ్గిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న కొద్దిపాటి ఉల్లి సైతం కోల్డ్ స్టోరేజీల్లో ఇదివరకే నిల్వ చేసినదిగా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. డిమాండ్ మేర సరఫరా లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయని చెబుతున్నాయి.
పది రోజుల్లోనే పెరిగిన ధర
పది రోజుల కిందట రూ.25 నుంచి రూ.28 మధ్య పలికిన కిలో ఉల్లి.. ప్రస్తుతం మార్కెట్‌లో గ్రేడ్-1 ఉల్లి రూ.40కి పైనే పలుకుతోంది. రైతు బజార్లలోనూ ధరల పెరుగుదల అనూహ్యంగా ఉంది. ఈనెల 20న రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.20 ఉండగా.. ప్రస్తుతం రూ.30 నుంచి రూ.32 పలుకుతోంది. గతేడాది ఈ సమయానికి కిలో రూ.24 నుంచి రూ.26 మధ్య ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేడ్-2 రకం ఉల్లి సైతం గతేడాదితో పోలిస్తే రూ.5 మేర పెరిగి మార్కెట్‌లో రూ.20కి లభ్యమవుతోంది. సమీప భవిష్యత్తులో కొత్త సరుకు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం లేనందున వ్యాపారులు నిల్వలను పెంచుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ధరలు పెరిగినప్పుడు పౌరసరఫరాల శాఖ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ధరను నియంత్రించింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.