
9 శాతం వృద్ధి సాధన సత్తా ఉంది
న్యూఢిల్లీ: భారత్‌కు 9 శాతం వృద్ధి రేటు సాధనా సామర్థ్యం ఉందని ఆర్థికమంత్రి పీ చిదంబరం బుధవారం పేర్కొన్నారు. రానున్న 10 నుంచి 30 యేళ్లలో వార్షికంగా భారత్ 8 నుంచి 9 శ్రేణిలో వృద్ధి సాధించగలదని ఆర్థికమంత్రి అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి చిదంబరం ప్రసంగిస్తూ, వృద్ధికి దోహదపడే కొన్ని విశిష్ట లక్షణాలు భారత్ సొంతమన్నారు.
దేశంలో 83 కోట్ల మంది అంటే మొత్తం జనాభాలో దాదాపు 68 శాతం మంది 35 సంవత్సరాలలోపువారేనని వివరించారు. పలు ఖనిజ నిక్షేపాలు, సుదీర్ఘ సముద్రతీరం, భారీ పంట దిగుబడులకు వీలయ్యే భూమి వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటన్నింటినీ వినియోగించుకుని భారత్‌కు వచ్చే 10,20,30 యేళ్లలో వార్షికంగా 8-9 శాతం శ్రేణి వృద్ధిని సాధించే సత్తా ఉందని అన్నారు.
మనల్ని మనమే మోసగించుకుంటున్నాం...
పన్ను సంస్కరణల అమలుపై ఆయన మాట్లాడుతూ, రూ.కోటి వార్షిక ఆదాయం ఉన్నదని అంగీకరిస్తున్నవారు దేశంలో కేవలం 42,800 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. ‘నేను అనుకోవడం ఏమిటంటే... కోటి ఆదాయం ఉన్నవారు దక్షిణ ఢిల్లీలోనే 42,800 మంది ఉన్నారని. దీని అర్ధం ఏమిటి? మనం మనల్నే మోసం చేసుకుంటున్నాం. దేశాన్ని మోసగిస్తున్నాం. పన్నులు చెల్లించాలని మనం కోరుకోవడం లేదు’ అని చిదంబరం ఈ సందర్భంగా అన్నారు.
తగిన ప్రతిఒక్కరూ పన్నులు చెల్లిస్తే, పెట్టుబడులకు ప్రభుత్వానికి మరిన్ని నిధులు వస్తాయని ఆర్థికమంత్రి అన్నారు. ఇది దేశాభివృద్ధికి కూడా దోహదపడుతుందని వివరించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అవినీతి ఒకటని చిదంబరం పేర్కొన్నారు. రూ.2000 కోట్ల పన్ను ఎగవేతలను నిరోధించడానికి ఉద్దేశించి దాదాపు 12 లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపినట్లు ఈ సందర్భంగా తెలిపారు.