టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ టాప్ 100 ర్యాంకుల ప్రకటన
లండన్: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీల జాబితాలో భారత్‌లోని పది యూనివర్సిటీలకు చోటు లభించింది. జాబితాలో పంజాబ్ యూనివర్సిటీ 13వ స్థానంలో, ఐఐటీ ఖరగ్‌పూర్ (30), ఐఐటీ కాన్పూర్(34)వ స్థానాల్లో నిలవగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీలు సంయుక్తంగా 37వ స్థానంలో నిలిచాయి. ఐఐటీ గువాహటి 46, ఐఐటీ మద్రాస్, జాదవ్‌పూర్ యూనివర్సిటీలు 47, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 50, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ 57 స్థానాలను దక్కించుకున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్), మరో 17 అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రపంచస్థాయి యూనివర్సిటీలపై తొలిసారి సర్వే చేసిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ ఈ మేరకు ర్యాంకులను ప్రకటించింది.
ఈ టాప్ 100 వర్సిటీల జాబితాలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. చైనాలోని పెకింగ్, త్సింగ్వా యూనివర్సిటీలు మొదటి, రెండో స్థానంలో నిలవగా.. ఆ దేశంలోని 44 యూనివర్సిటీలు టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. బోధన, పరిశోధన, నాలెడ్జి ట్రాన్స్‌ఫర్, అంతర్జాతీయ దృక్పథం వంటి 13 అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. భారత్‌లో 20 యూనివర్సిటీలు మాత్రమే తమ సమాచారాన్ని అందజేయడంతో ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పరిశీలించలేదు. పాకిస్థాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లోని ఒక్క యూనివర్సిటీకి కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు.