
విదేశాల్లో నల్లధనంపై దృష్టి
⇔ స్విస్ బ్యాంకుతో సంప్రదింపులు
⇔ పది మంది వ్యక్తులతోపాటు సంస్థల వివరాలు కోరిన స్విస్
⇔ నోటీసులు జారీ చేసిన పన్ను విభాగం
⇔ నెలలోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు
న్యూఢిల్లీ/బెర్న్: విదేశాల్లో నల్లధనంపై కేంద్రం దృష్టిసారించింది. పదిమంది వ్యక్తులతోపాటు సంస్థలు బ్యాంకుల్లో దాచిఉంచిన పన్ను చెల్లించని సొమ్ము తాలూకు వివరాలు అందజేయాల్సిందిగా స్విట్జర్లాండ్‌కు విన్నవించింది. ఇందులో టెక్స్‌టైల్ కంపెనీలతోపాటు తివాచీ ఎగుమతి వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. భారత్ విన్నపం నేపథ్యంలో స్విట్జర్లాండ్ పన్ను విభాగం ఆయా వ్యక్తులు, సంస్థలకు గత వారం నోటీసులు పంపింది. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్విట్జర్లాండ్ నిబంధనల ప్రకారం అనుమానిత పన్ను నేరాలకు సంబంధించి విదేశీ ప్రభుత్వాలు వివరాలు కోరినట్టయితే ఆ సమాచారాన్ని వారితో పంచుకునే ముందు ఆయా సంస్థలు, వ్యక్తులకు ఒక ఒకే అవకాశం ఉంటుంది.
సంబంధిత వ్యక్తులు నేరుగాగానీ లేదా ఆయా బ్యాంకులద్వారాగానీ అందుబాటులో లేకపోతే ఈ నోటీసులను గెజిట్ నోటిఫికేషన్లద్వారా బహిర్గతం చేస్తుంది. ఒకేసారి ఇలా పదిమంది వ్యక్తులు, సంస్థలకు నోటీసులు పంపడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ నోటీసులు అందుకున్న సంస్థల్లో నియో కార్పొరేషన్ ఇంటర్నేషనల్, ఎస్‌ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నల్లధనం తాలూకు కొన్ని ఆధారాలను సేకరించిన కేంద్రం...ఇందుకు సంబంధించి పాలనాపరమైన చేయూత ఇవ్వాలంటూ ఆ దేశంపై కొంతకాలంగా ఒత్తిడి చేస్తుండడం తెలిసిందే. స్విట్జర్లాండ్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లలోనూ కొంతమంది భారతీయుల పేర్లు బయటపడడం తెలిసిందే.