ఆ ముగ్గురికీ ముఖాముఖి ప్రశ్నలు? | India will help Pakistan probe Pathankot attack | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురికీ ముఖాముఖి ప్రశ్నలు?

Published Fri, Jan 15 2016 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

India will help Pakistan probe Pathankot attack

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌పై దాడి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఆ దాడికి ముందు తనను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, వదిలిపెట్టారని చెప్పిన పంజాబ్ ఎస్‌పీ సల్వీందర్‌ను నాలుగో రోజైన గురువారం  సైతం ప్రశ్నించింది. ఆయనతో పాటు కిడ్నాపైనట్లు చెప్తున్న వంట మనిషిని.. వారిద్దరూ కిడ్నాప్‌కు గురయ్యేముందు సందర్శించినట్లు చెప్తున్న దర్గా సంరక్షకుడు సోమ్‌రాజ్‌ను ప్రశ్నించింది. కిడ్నాప్ పూర్వాపరాలకు సంబంధించి ఎస్‌పీ చెప్తున్న మాటల్లో పొంతన లేకపోవటం.. ముగ్గురు చెప్తున్న అంశాలూ పరస్పర విరుద్ధంగా ఉండటంతో మరింత స్పష్టత కోసం సల్వీందర్‌సింగ్, మదన్‌గోపాల్, సోమ్‌రాజ్‌లు ముగ్గురినీ కలిపి కూర్చోబెట్టి ప్రశ్నిస్తామని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.

తాను పంజ్ పీర్ దర్గాకు తరచుగా వెళ్లేవాడినని ఎస్‌పీ చెప్తుంటే.. పఠాన్‌కోట్‌పై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు తొలిసారిగా ఆయన ఆ దర్గాకు రావటం చూశానని, అంతకుముందు ఎన్నడూ రావటం చూడలేదని సోమ్‌రాజ్ చెప్తున్నాడు. ఎస్‌పీకి నిజనిర్ధారణ పరీక్ష నిర్వహించే అంశంపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్నాయి.
 
దీనానగర్ దాడితో పోలికలు... ఇదిలావుంటే.. పంజాబ్‌లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి.. దానికి కొన్ని నెలల ముందు అదే రాష్ట్రంలోని దీనానగర్‌లో ఒక పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రదాడికి పోలికలు ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. గత ఏడాది జూలై 27న సైనిక దుస్తుల్లో భారీ ఆయుధాలతో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు దీనానగర్‌లో ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సుపై బుల్లెట్ల వర్షం కురిపించటంతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. వారి దాడిలో ఒక ఎస్‌పీ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా పోలీసు బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులూ హతమయ్యారు. ఈ కేసును పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిని ఎన్‌ఐఏకు అప్పగించేందుకు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌బాదల్ ఇటీవల నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement