మెల్బోర్న్: గ్రహ స్థితి బాగో పోయినా, గృహ స్థితి బాగో పోయినా మనం జ్యోతిష్యుల్ని సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవడానికి యత్నిస్తాం. జ్యోతిష్యం, వాస్తుని మూఢ నమ్మకాలగా భావించే వారు కొందరైతే, వాటిని ఉన్నతంగా భావించి పరిష్కార మార్గాలు వెతుక్కునే వారికి కూడా కొదవలేదు. మరోవైపు, జ్యోతిష్యం పేరుతో మోసాలకు పాల్పడేవారు కోకల్లలు. అసలు విషయాన్నివదిలేసి జనాన్ని బురిడీ కొట్టించడమే కొంతమంది లక్ష్యం.
జ్యోతిష్యం అనగానే ముందుగా భారతీయులే గుర్తుకొస్తారు. భారతీయ పండితులంటే దేశ విదేశాల్లో చాలామంది బారులు తీరుతారు. అలా వచ్చిన ఓ మహిళపై భారత సంతతి జ్యోతిష్యుడొకడు ఆస్ట్రేలియాలో అత్యాచారం చేశాడు. వెంకటేష్ కొండప్ప అనే ఈ పెద్దమనిషి.. జనవరిలో తన వద్దకు వచ్చిన మహిళకు ఏవో దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పి నమ్మించాడు. అనంతరం ఆమెను తన కార్యాలయానికి రప్పించుకుని అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో అతనిపై ఎనిమిది చార్జిషీట్ల దాఖలు కావడంతో ఆ జ్యోతిష్యుడు శుక్రవారం మెల్బోర్న్ కోర్టుకు హాజరయ్యాడు.
కొత్త వారితో శృంగారం జరిపితే సమస్యకు పరిష్కారం దొరకుతుందని ఆ జ్యోతిష్యుడు మాయమాటలు చెప్పాడని, వాటిని రెండు సార్లు తిరస్కరించినా ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులు కోర్టుకు విన్నవించారు. కాగా, ఆ మహిళ కక్ష కట్టి తనపై ఆరోపణలు చేసిందని, తాను ఎటువంటి తప్పు చేయలేదని అతను కోర్టుకు తెలిపాడు.