ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాక్ కీలక నిర్ణయం
భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాయాది దేశం కీలక నిర్ణయం తీసుకోబోతుంది.
ఇస్లామాబాద్ : భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాయాది దేశం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. పాక్ సైన్యాధిపతి రహీల్ షరీఫ్ పదవీ కాలాన్ని పొడిగించే అవకాశలున్నట్టు వెల్లడవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ పదవీకాలం నవంబర్ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ప్రస్తుతం నెలకొన్న యుద్ద వాతావరణం ఇలానే కొనసాగితే ఆయనను మార్పు చేసే అవకాశాలు లేనట్టు డిఫెన్స్ విశ్లేషకుడు సల్మాన్ మసూద్ తెలుపుతున్నారు. పాకిస్తాన్ సైన్యాధిపతిగా మరోఏడాది పాటు ఆ పీఠం ఆయనకే దక్కుతుందని తెలుస్తోంది.
కొంతమంది పార్టీ సహచరులు కూడా జనరల్ షరీఫ్ పదవి పొడిగించాలని ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్కు సలహాలు ఇస్తున్నారట.కానీ దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వడంలేదు.ఒకవేళ షరీఫ్ స్థానంలో కొత్త వాళ్లు వస్తే, వారు ఎన్నోసవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని మసూద్ తెలిపారు. ఓ వైపు భారత్తో నెలకొన్న ఈ ఉద్రిక్త సమస్యలను నిర్మూలించి సంబంధాలను మెరుగుపరుచుకోవడం, అంతర్గతంగా రాజకీయ స్థిరత్వం పొందడం అతిపెద్ద సవాళ్లుగా వారికి నిలుస్తాయని పేర్కొన్నారు. ఇటీవలే అఫ్గానిస్తాన్, ఇరాన్లతో కూడా పాకిస్తాన్కు సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పారు.
పాకిస్తాన్ వ్యాప్తంగా యాంటీ-టెర్రర్ క్యాంపెయిన్లు నిర్వహించడం, మిలటరీలో అవినీతిని నిర్మూలించడంలో జనరల్ షరీఫ్ చాలా ప్రసిద్ది. భారత్తో యుద్ద పరిస్థితుల నేపథ్యంలో టాప్ కమాండర్ను మార్చడం అంత మంచిది కాదని పాకిస్తానీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నేత అలీ ముహమ్మద్ ఖాన్ చెప్పారు. పాకిస్తానీ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా పాపులరైన షేక్ రషీద్ అహ్మద్ కూడా షరీఫ్కే పదవి పొడిగింపుకే మద్దతు పలుకుతున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా వారి పదవిల్లో అలాగే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు పాకిస్తాన్ సైన్యాధిపతిగా ఎవరిని నియమించాలన్న దానిపై ఆ దేశ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. దేశంలో శక్తిమంతమైన సైన్యం నూతన అధిపతి తమకు అనుకూలుడై ఉండాలని ఇటు నవాజ్, అటు రహీల్ ఎవరికి వారు అనుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది.