
జయ 'విజన్ 2023': బిజినెస్ పెద్దల సంతాపం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలువురు పారిశ్రామిక పెద్దలు, వ్యాపార వేత్తలు, వివిధ పరిశ్రమ సంఘాల ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి ఆర్థిక పురోగతికి ఆమె ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
'తమిళనాడు విజన్ 2023' కాన్సెప్ట్ తో పనిచేసిన ఏకైక వ్యక్తి జయలలిత అని ఫిక్కీ అధ్యక్షుడు పీ మురారి సంతాపం ప్రకటించారు. అనేక విషయాల్లో ఆమె పరిశ్రమ సలహాలను స్వీకరించే వారని తెలిపారు. ముఖ్యంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల ప్రాముఖ్యతలపై తామిచ్చిన సలహాలను వెంటనే ఆమోదించారన్నారు. తాను1955 -1984 మధ్య కాలంలో తమిళనాడు ప్రభుత్వంతో ఉన్నాననీ, ఒక యూనిక్ దృష్టితో తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధికోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఆమె లేని లోటును పూరించడం చాలా కష్టమన్నారు.
టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అమ్మ మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆర్ధిక పురోగతి, రాష్ట్ర శ్రేయస్సు ,ఉద్యోగాల కల్పనకు కోసం పరిశ్రమ, వాణిజ్య రంగానికి మంచి ప్రోత్సాహాన్నిచ్చరని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి కలకాలం గుర్తుండిపోతుందన్నారు.
హ్యుందాయ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో వై కెకూ సంతాపం ప్రకటిస్తూ ఆమె మరణం తీవ్ర దిగ్భ్రమ కలిగించిందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధితోపాటు, హ్యుందాయ్ మోటార్ కార్యకలాపాలకు మద్దతు అందించారన్నారు.
జయలలిత మరణం తనను తీవ్రంగా బాధించిందంటూ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సంతాపం తెలిపారు. అమ్మను మంచి చతురత, వాగ్దాటి ఉన్న 'ఐరన్ లేడీ' గా ఆయన పేర్కొన్నారు.