
ఐపీవో నిబంధనల సడలింపు
ఈక్విటీ, డెట్ ఇష్యూల ద్వారా కంపెనీలు నిధులు సమీకరించే ప్రక్రియను సులభతరం చేసేలా స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలు సడలించింది.
ముంబై: ఈక్విటీ, డెట్ ఇష్యూల ద్వారా కంపెనీలు నిధులు సమీకరించే ప్రక్రియను సులభతరం చేసేలా స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలు సడలించింది. అలాగే, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడేవారిని, పొంజీ స్కీముల వంటివి నిర్వహించే వారిని కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంగళవారం జరిగిన సమావేశంలో బోర్డు ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ ఇన్వెస్టర్ల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) విభాగం నిబంధనలపై సెబీ స్పష్టతనిచ్చింది. దీనికికూడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) విభాగం తరహాలోనే పన్ను ప్రయోజనాలు లభించేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది. ఎఫ్‌పీఐ విధానంలో రిస్కు సామర్థ్యాన్ని బట్టి విదేశీ ఇన్వెస్టర్లను మూడు తరగతులుగా విభజించిన సంగతి తెలిసిందే. పబ్లిక్ ఆఫర్‌ల విషయానికొస్తే.. ఐపీవోలకు గ్రేడింగ్ తప్పనిసరన్న నిబంధనను తొలగించాలన్న ప్రతిపాదనను సెబీ బోర్డు ఆమోదించింది. దీంతో ఇకపై ఇది ఐచ్ఛికంగానే ఉంటుంది. అలాగే, ఒకే ప్రాస్పెక్టస్ ద్వారా ఒక ఏడాదిలో విడతలవారీగా నిధుల సమీకరణకు ఉపయోగపడే షెల్ఫ్ ప్రాస్పెక్టస్ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో సెబీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇవి అమల్లోకి వస్తాయి.
అధికారాల దుర్వినియోగానికి చెక్...
వివిధ అంశాలకు సంబంధించి కొత్తగా తనకు దఖలుపడిన అధికారాలు దుర్వినియోగం కాకుండా, సమర్థవంతంగా ఉపయోగించుకునే దిశగా కూడా సెబీ బోర్డు కొత్త నిబంధనలను ఆమోదించింది. తనిఖీలు .. జప్తు చేయడాలు, సెటిల్మెంట్ అంశాలు, ఇన్వెస్టర్లకు వేగవంతంగా సొమ్ము తిరిగి లభించేలా చూడటం తదితర అంశాలకు సంబంధించి సెబీకి మరిన్ని అధికారాలు లభించిన సంగతి తెలిసిందే. ఇవి దుర్వినియోగం కాకుండా, సంబంధిత సంస్థల ప్రైవసీకి భంగం కలగకుండా చూడటం తాజా నిబంధనల ప్రధానోద్దేశం. ఒకవైపు ఇన్‌సైడర్ ట్రేడింగ్ వంటి తీవ్రమైన నేరాలకు సెటిల్మెంట్ అవకాశం కల్పించకుండా మరోవైపు సివిల్ వివాదాలు పారదర్శకంగా పరిష్కారమయ్యేలా చూసేందుకు కూడా స్పష్టమైన విధివిధానాలను సెబీ ఖరారు చేసింది.
లిస్టెడ్ కంపెనీలకు కొత్త కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్, ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల సవరణ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుల ఏర్పాటు విధివిధానాలు తదితర అంశాలు కూడా సెబీ బోర్డు సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, వీటిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.