
388 పాయింట్ల ర్యాలీ
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల నుంచి ఊరట లభించే ఒప్పందాన్ని ఇరాన్ కుదుర్చుకోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ కదంతొక్కింది. పటిష్టంగా ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ రోజంతా ర్యాలీ జరిపి చివరకు 388 పాయింట్ల భారీ లాభంతో 20,605 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 120 పాయింట్లు ఎగిసి, తిరిగి 6,100 పాయింట్లకు ఎగువన 6,115 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బ్యాంకింగ్, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి.
ఇరాన్ చమురు దిగుమతులతో తక్షణ ప్రయోజనం పొందే ఆయిల్ రిఫైనరీ షేర్లు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లు 5-6 శాతం, ఓఎన్‌జీసీ 4 శాతం చొప్పున పెరిగాయి. ఇరాన్‌లో ఇన్‌ఫ్రా, రిఫైనరీ ప్రాజక్టుల నిర్మాణాల కాంట్రాక్టులు లభించవచ్చన్న అంచనాలతో ఎల్ అండ్ టీ 4 శాతం ర్యాలీ జరిపింది. క్యాపిటల్ గూడ్స్ ఎగుమతుల ద్వారా లబ్దిపొందవచ్చన్న కారణంగా బీహెచ్‌ఈఎల్, క్రాంప్టన్‌గ్రీవ్స్, సీమెన్స్ షేర్లు 5-10 శాతం మధ్య ఎగిసాయి. తాజా డీల్‌తో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 2 శాతం తగ్గి 109 డాలర్లస్థాయికి దిగివచ్చింది. సమీప భవిష్యత్తులో క్రూడ్ మరింత తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం దిగి, వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ పడుతుందన్న అంచనాలతో బ్యాంకింగ్ షేర్లు పెరిగాయి. గతవారం ద్వితీయార్థంలో నికర అమ్మకాలు జరిపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సోమవారం తిరిగి మార్కెట్లో పెట్టుబడిచేసారు. వీరు రూ. 837 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ సంస్థలు యధాప్రకారం రూ. 792 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించాయి.
వేగం పుంజుకున్న నిఫ్టీ రోలోవర్స్...
నవంబర్ డెరివేటివ్ సిరీస్ వచ్చే గురువారం ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్ సిరీస్‌కు నిఫ్టీ కాంట్రాక్టుల రోలోవర్స్ సోమవారం వేగవంతమయ్యాయి. మార్కెట్ల అనిశ్చితి, ఎఫ్‌ఐఐల ట్రేడింగ్ కార్యకలాపాలు తగ్గడంతో గత శుక్రవారం వరకూ రోలోవర్స్ ప్రక్రియ మందకొడిగా సాగింది. తాజాగా నవంబర్ ఫ్యూచర్ నుంచి 15.41 లక్షల షేర్లు (11 శాతం) కట్‌కావడంతో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.23 కోట్ల షేర్లకు దిగింది. ఇదే సమయంలో డిసెంబర్ ఫ్యూచర్లో 23.12 లక్షల షేర్లు యాడ్‌కావడంతో ఓఐ 95 లక్షల షేర్లకు పెరిగింది. ఈ నెల సిరీస్ ముగింపునకు మరో మూడురోజులే గడువు వున్నా స్పాట్ నిఫ్టీతో పోలిస్తే నవంబర్ ఫ్యూచర్ నిఫ్టీ 20 పాయింట్ల ప్రీమియంతో ట్రేడ్‌కావడంతో పాటు డిసెంబర్ ఫ్యూచర్ 60 పాయింట్లకుపైగా ప్రీమియంతో ముగియడం లాంగ్ రోలోవర్స్‌కు సంకేతం. నిఫ్టీ పెరుగుతుందన్న అంచనాలతో గతంలో కొనుగోలుచేసిన ఈ నెల ఫ్యూచర్‌ను విక్రయించి, వచ్చే నెలకు ఇదే ఫ్యూచర్‌ను తిరిగి కొనుగోలుచేయడాన్ని లాంగ్ రోలోవర్‌గా వ్యవహరిస్తారు.
ఇరాన్ డీల్... భారత మార్కెట్‌కే బాగా అనుకూలం
ఇరాన్ డీల్ ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గడంతో కొన్ని ఆసియా, యూరప్ సూచీలు పెరిగినప్పటికీ, ఈ డీల్ భారత్‌కు మరింత సానుకూలం కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు మిగతా ప్రపంచ సూచీలకంటే భారీగా పెరిగాయి. భారత్ చమురు దిగుమతుల్లో 8 శాతం ఇరాన్ నుంచే జరుగుతాయి. వీటికి చెల్లింపుల్ని డాలరు రూపేణా కాకుండా యూరోలు, రూపాయిల్లో భారత్ చెల్లిస్తుంది. అయితే ఆంక్షల ఫలితంగా కొద్ది నెలల నుంచి యూరోల రూపంలో చెల్లింపులు నిలిచిపోయాయి. డాలరు ద్వారా కాకుండా ఇక నుంచి ఈ రెండు మారకాల్లో చెల్లించడంవల్ల భారత్‌కు డాలర్లు ఆదా అవుతాయి. అలాగే ఇరాన్ నుంచి చమురు రవాణా చేసే నౌకలకు బీమా ప్రీమియంమీద యూరప్ దేశాలు విధించిన ఆంక్షలు తొలగడం కూడా చమురు దిగుమతులకు అనుకూలాంశం. ప్రస్తుతానికి ఇరాన్ జరిపే చమురు ఎగుమతుల్ని పెంచడానికి ప్రస్తుత ఒప్పందం వీలుకల్పించకపోయినా, భవిష్యత్తులో క్రమేపీ ఆంక్షల సడలింపుతో భారత్‌కు ఇరాన్ చమురు సరఫరా పెరిగే వీలుంటుందని అంచనా. మరోవైపు ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రికల్స్, ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల నిర్మాణం వంటి వ్యాపారాలకు ఇరాన్ పెద్ద మార్కెట్ అయినందున, ఈ ఉత్పత్తులు, సేవల్ని ఆ దేశానికి సరఫరా చేయడం ద్వారా భారత్‌కు లబ్ది ఎక్కువ వుంటుందన్నది విశ్లేషకుల అంచనా. ఈ కారణాలన్నీ భారత్ సూచీల్ని భారీ ర్యాలీకి పురికొల్పాయి.