రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పోల్చడంపై హిందూవాదులే కాదు ఉదారవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబిబ్ మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కితగ్గడం లేదు.
అలీగఢ్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పోల్చడంపై హిందూవాదులే కాదు ఉదారవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబిబ్ మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కితగ్గడం లేదు. ఐఎస్ఐఎస్‌లాగా ఆరెస్సెస్ కూడా మూర్ఖమైనదని ఆయన మరోసారి పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. 'ప్రజాస్వామిక విలువలను కాపాడాల్సింది ఉదారవాదులే కాదు.. అది అందరి బాధ్యత. లౌకిక విలువలను కాపాడటానికి దేశ ప్రజలందరూ ముందుకురావాలి. ప్రజాస్వామిక, లౌకిక విలువలను ప్రజలు కాపాడుకుంటున్నారని చెప్పడానికి ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన పంచాయతీ ఎన్నికలు సంకేతం' అని ఇర్ఫాన్ హబిబ్ తెలిపారు.
మతం పేరిట ఉగ్రవాద భావజాలాలు అనుసరించే వ్యక్తుల అజ్ఞానం నేపథ్యంలోనే తాను ఆరెస్సెస్‌ను ఐఎస్ఐఎస్‌తో పోల్చానని చెప్పారు. 'అజ్ఞానం, మూర్ఖత్వం విషయంలో ఆరెస్సెస్, ఐఎస్ఐఎస్ ఒక్కటే. 1947నాటి ఘటనలు విద్వేష నేరాల్లో ఆరెస్సెస్, ఐఎస్ఐఎస్‌ను అధిగమించిందని చాటుతాయి. భారత చరిత్రను ఆరెస్సెస్ తప్పుగా చిత్రిస్తుంది. అది దేశాన్ని కించపరుస్తుంది' అని ఆయన పేర్కొన్నారు.