
గోప్యత హక్కా? కాదా?
‘ధర్మ’ సంకటం
ప్రపంచం డిజిజల్ అయిపోతోంది. మనిషికి సంబంధించిన సమస్త సమాచారం డిజిటల్ రూపంలో ఉంటోంది. ఆధార్ నమోదు కోసం, బ్యాంకుల్లో, పాస్‌పోర్ట్ కోసం, ఇతర అవసరాలకు మన వ్యక్తిగత సమాచారాన్ని ఆయా ప్రభుత్వ శాఖలతో, ప్రైవేటు సంస్థలతో పంచుకుంటాం. ఆరోగ్యపరీక్షల నివేదికలు సైతం ఆన్‌లైన్‌లో ఇస్తున్నారు. మరి మన వ్యక్తిగత సమాచారం ఎంత వరకు భద్రంగా ఉంటోంది. ఇప్పుడు ప్రతిదానికీ ఆధార్‌తో లింకు పెడుతున్నారు. మన సమాచారం ఇతరుల చేతుల్లో పడితే ఎలా? వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు మనకు లేదా? ఇప్పుడిదే ప్రశ్న సుప్రీంకోర్టు ముందుంది. ఆధార్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కని పిటిషనర్లు వాదిస్తున్నారు.
రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదు కాబట్టి ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు గత తీర్పులు స్పష్టం చేశాయి. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా... మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించుకోవాల్సి ఉంటుందనేది నిపుణుల వాదన. జీవించే హక్కు, స్వేచ్ఛను కల్పిస్తున్న ఆర్టికల్ 21, భావ ప్రకటనా స్వేచ్ఛను, దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను, నచ్చిన ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని చేసుకునే హక్కును, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పిస్తున్న ఆర్టికల్ 19 స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా నిర్వచించాలని కోరుతున్నారు. రాజ్యాంగంలో నిర్దిష్టంగా చెప్పకపోయినా... భావ ప్రకటనా స్వేచ్ఛను అన్వయించి సుప్రీంకోర్టు ప్రతికాస్వేచ్ఛను ప్రసాదించిందని తొమ్మిదిమంది రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మంగళవారం వాదనల సందర్భంగా ఎత్తిచూపారు. ఈ విషయంలో గత తీర్పులేమిటి, తొమ్మిదిమందితో ధర్మాసనం వేయడానికి దారితీసిన పరిస్థితులేమిటో చూద్దాం...
ఎం.పి. శర్మ– సతీష్ చంద్ర, ఢిల్లీ కలెక్టరు కేసు.. 1954
దాల్మియా జైన్ ఎయిర్‌వేస్ లిమిటెడ్ అనే కంపెనీని 1946లో ప్రారంభించి... 1952లో మూసివేశారు. ఇది దాల్మియా గ్రూపునకు అనుబంధ సంస్థ. ఎయిర్‌వేస్ వ్యవహారాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని 1953 నవంబరు 19న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సోదాల కోసం జిల్లా కలెక్టరు అనుమతి పొంది... దాల్మియా గ్రూపునకు చెందిన 34 ప్రదేశాల్లో సోదాలు జరిపారు. కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల రాజ్యాంగబద్ధతను ఎం.పి.శర్మ తదితరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆర్టికల్ (19)(1)(ఎఫ్)... ఆస్తులు కొనడానికి, కలిగి ఉండటానికి, అమ్మడానికి హక్కు కల్పిస్తుంది.
ఆర్టికల్ 20 (3)... నేరాంగీకారానికి నిందితుడిని బలవంతం చేయకుండా రక్షణ కల్పిస్తుంది. నిందితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అతన్ని దోషిగా తేల్చడానికి వీలుండదు. భారతీయులుగా తమకున్న ఈ రెండు ప్రాథమిక హక్కులకు సోదాలు భంగం కలిగించాయని, తమ వ్యక్తిగత రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్‌లు వాదించారు. సోదాలు లేదా స్వాధీనం చేసుకోవడమనేది... తాత్కాలికంగా హక్కుల్లో జోక్యం చేసుకోవడమేనని, ఇది చట్టబద్ధంగా నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం జరిగితే తప్పులేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఎనిమిది మంది జడ్జిల బెంచ్ తేల్చింది. రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదంది.
ఖారక్ సింగ్– ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
దోపిడి కేసులో తగిన సాక్ష్యం లేదని ఖారక్ సింగ్‌ను విడుదల చేశారు. తర్వాత యూపీ పోలీసులు అతనిపై హిస్టరీ షీట్‌ను తెరిచి... కదలికలపై నిఘా ఉంచారు. తన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారంటూ ఖరాక్‌సింగ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆర్టికల్ 19(1)(డి) కల్పిస్తున్న స్వేచ్ఛగా సంచరించే హక్కుకు, ఆర్టికల్ 21 ప్రసాదిస్తున్న జీవించే హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు పోలీసులు భంగం కలిగించారని వాదించారు. వీరి చర్యలు తన వ్యక్తిగత గోప్యతకు భంగకరమన్నారు. 1963లో ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ అతని పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాజ్యాంగంలో ఎక్కడా వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొనలేదంది.
ఆధార్‌తో మళ్లీ తలెత్తిన ప్రశ్న
తర్వాత 1970, 80లలో సుప్రీంకోర్టులో వివిధ బెంచ్‌లు దీనికి విరుద్ధంగా అభిప్రాయపడినా... సంఖ్యాపరంగా అవి చిన్నవి కాబట్టి... 1954లో ఎనిమిది మంది జడ్జిలు వెలువరించిన తీర్పు (వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదు) ఇప్పటికీ చలామణిలో ఉంది. 2015లో ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిగత వివరాల భద్రతపై, గోప్యతపై సందేహాలను లేవనెత్తారు. నాటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ... వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కు కాదని అన్నారు. ఒకవేళ దీనిపై భిన్నాభిప్రాయాలుంటే... తొమ్మిది మంది జడ్డిలతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి... విషయాన్ని నిగ్గుతేల్చాలన్నారు.
మంగళవారం ఆధార్‌పై కేసులు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందుకు మరోసారి విచారణకు వచ్చాయి. ఆధార్ కోసం తమ బయోమెట్రిక్ వివరాలను సేకరించడం, దాన్ని ఇతరులతో పంచుకోవడం.... ప్రాథమిక హక్కు అయిన వ్యక్తిగత గోప్యతకు భంగకరమని పిటిషనర్‌లు వాదించారు. ఈ విషయంలో 1954లో ఎనిమిది మంది జడ్జిలు ఇచ్చిన తీర్పును ఆమోదించాలని... లేదంటే తొమ్మిది మంది న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని వేసి... ఈ అంశంపై (వ్యక్తిగత వివరాల గోప్యత ప్రాథమిక హక్కా? కాదా?) పునఃపరిశీలన జరపాలని అడ్వకేట్ జనరల్ కే.కే.వేణుగోపాల్ వాదించారు. దీంతో ఎనిమిది మంది జడ్జిలతో కూడిన బెంచ్ ఆరు దశాబ్దాల కిందట ఇచ్చిన తీర్పు... రాజ్యాంగబద్దతను పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
ఇతరదేశాల్లో...అమెరికాలో...
అమెరికా రాజ్యాంగంలో వ్యక్తిగత గోప్యత ప్రస్తావన లేనప్పటికీ... సుప్రీంకోర్టు పలు రాజ్యాంగ సవరణలను ఆధారంగా చేసుకొని దీన్ని ప్రాథమిక హక్కుగా పేర్కొనవచ్చని తేల్చింది. సరైన కారణం లేకుండా తనిఖీలకు వీల్లేకుండా సవరణ తెచ్చారు. 1974లో తెచ్చిన ప్రైవసీ యాక్టు ప్రకారం... వ్యక్తుల సమాచారాన్ని ఫెడరల్ ఏజెన్సీలు అనధికారికంగా వాడుకోవడానికి లేదు. ఎందుకోసం సమాచారాన్ని కోరుతున్నారో ఫెడరల్ ఏజెన్సీలు స్పష్టంగా చెప్పాలి. రికార్డుల నిర్వహణలోనూ ఏజెన్సీలు కచ్చితత్వం పాటించాలి.
జపాన్‌లో...
వ్యక్తిగత సమాచార గోప్యతను కాపాడేందుకు 2003లో జపాన్ ప్రత్యేకంగా చట్టం చేసింది. ఎవరి సమాచారాన్నైనా ఉపయోగిస్తుంటే... ఎందుకు వాడుతున్నామో సదరు వ్యక్తికి స్పష్టంగా చెప్పాలి. సమాచారాన్ని సదరు వ్యక్తి సమ్మతితోనే ఎవరికైనా (సంస్థలకు) ఇవ్వాలి. 2015లో జపాన్ కూడా ‘మై నంబర్’ పేరిట పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్యను(ఆధార్‌లాగే) తమ పౌరులకు ఇచ్చింది. 2018 నుంచి దీన్ని ఐచ్చికంగా వాడి... 2021 నుంచి దీన్ని అన్ని లావాదేవీలకు తప్పనిసరి చేయనుంది.
యూరోప్...
డాటా భద్రతకు సంబంధించి సభ్యదేశాలకు ఈయూ ఆదేశికసూత్రాలున్నాయి. వ్యక్తిగత సమాచారం ప్రమాదవశాత్తు లేదా చట్టవిరుద్ధంగా తుడిచిపెట్టుకుపోకుండా ఈయూ దేశాలు తగిన వ్యవస్థలను రూపొందించుకోవాలి. అనధికారికంగా సమాచారాన్ని వెల్లడించకూడదు, ఎవరికీ అందుబాటులో ఉండకూడదు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్