టీ పెడతారా?
-
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణపై సందేహాలు
-
గడువు తక్కువ ఉండటంపై సర్వత్రా ఉత్కంఠ
-
మరోవైపు ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికలు
-
జనవరి ఆఖరు నుంచి పక్షం రోజులే అతి కీలకం
-
అసెంబ్లీలో చర్చ జనవరి 23 దాకా జరిగే అవకాశం
-
ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
మార్చి మూడో వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు
-
విభజన అంశం చివర్లో ఏ మలుపులు తిరిగేనో?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు భవిష్యత్తు ఏమిటన్నది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న చర్చ ఊపందుకుంది. ఫిబ్రవరిలో జరిగే పార్ల మెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదముద్ర పడుతుందా? లేక చివరి అంకంలో మరేదైనా జరుగు తుందా? రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? ఇలాంటి అనేక కీలకాంశాలపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లోగా విభజన బిల్లు ఆమోదం పొందదని కొందరు, ఆలోగానే అంతా పూర్తవుతుందని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. గడువు తక్కువ ఉన్నందున చివరి దశలో ఏదైనా జరగొచ్చన్న అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.
డిసెంబర్ 20తో నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్ సమావేశాలు తిరిగి ఎప్పుడు జరుగుతాయన్నది తేలితే విభజన బిల్లు భవిష్యత్తుపై కొంత స్పష్టత వచ్చే అవకాశముంది. జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం దాకా పక్షం రోజులు విభజన బిల్లుకు అత్యంత కీలకంగా మారాయి. ఏదేమైనా విభజన బిల్లు కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమని హస్తిన రాజకీయ వర్గాల్లో విన్పిస్తోంది. బిల్లు కోసం అవసరమైతే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తామని గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి సాధ్యం కాదంటున్నారు. విభజన బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని తాజాగా కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.
విభజన బిల్లుపై 40 రోజుల్లోగా ఉభయ సభల అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా దాన్ని రాష్ట్రానికి పంపిన సందర్భంగా రాష్ట్రపతి సూచించడం తెలిసిందే. ఆ గడువును పూర్తిగా వినియోగించుకునేలా అసెంబ్లీ మలి విడత షెడ్యూల్‌ను జనవరి 3 నుంచి 23వ తేదీ దాకా ప్రకటించారు. బిల్లుపై ఉభయ సభల్లో చర్చ పూర్తయ్యాక సభ్యుల అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి మూడు రోజుల్లోగా తిప్పి పంపాలని రాష్ట్రపతి నిర్దేశించారు. అభిప్రాయాలన్నింటినీ ఆంగ్లంలోకి తర్జుమా చేసి 50 ప్రతులను రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. 279 మంది ఎమ్మెల్యేలు (15 ఖాళీలున్నాయి), ఎమ్మెల్సీల్లో 75 మంది (15 ఖాళీలున్నాయి) మాట్లాడే పక్షంలో మొత్తం 354 మంది సభ్యుల అభిప్రాయాలనూ మూడు రోజుల్లోగా ఆంగ్లంలోకి తర్జుమా చేయించాల్సి నివేదికను రాష్ట్రపతికి పంపాలి. దాని అధ్యయనానికి రాష్ట్రపతి ఎంత గడువు తీసుకుంటారన్నది కూడా కీలకంగా మారింది. ఉభయ సభలు జనవరి 23 వరకూ కొనసాగితే ఆ తర్వాత మూడు రోజుల్లోగా, అంటే 26 నాటికి గానీ, ఆ రోజు గణతంత్ర దినంతో పాటు ఆదివారం కూడా గనుక దాన్ని పరిగణనలోకి తీసుకుంటే 27న గానీ రాష్ట్రపతికి నివేదిక పంపాలి. కానీ బీఏసీ నిర్దేశించిన ఎజెండా మేరకు సభ జరగడం చాలా అరుదు. కేంద్రం నుంచి ఆదేశాలేమైనా వస్తే జనవరి 23 దాకా ఆగకుండా ముందుగానే సభ్యుల అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్రపతికి పంపించే అవకాశాలూ లేకపోలేదు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యమన్నది చూడాల్సిందే.
చివరి అంకంలో చిక్కుముడులు
ఉభయ సభల అభిప్రాయాలతో గడువులోగా రాష్ట్రపతికి బిల్లును తిప్పి పంపినా అక్కడి నుంచి దాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే దాకా ఉన్న దశ కూడా అత్యంత కీలకమే. బిల్లుపై రాష్ట్రపతి ముందుగా కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపాలి. అందుకాయన ఎంత గడువు తీసుకుంటారో తెలియదు. ఒకవేళ ఒక్క రోజులోనే పంపుతారని భావించినా.. అసెంబ్లీ, మండలిల్లో సభ్యులు చేసిన సూచనలు, లేవనెత్తిన రాజ్యాంగపరమైన సందేహాలు, సీమాంధ్రకు సంబంధించి సమస్యల వంటి అంశాలన్నింటినీ కేంద్ర మంత్రివర్గం పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సూచనలు, సిఫార్సులతో ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం ముందుకు హోం శాఖ తీసుకెళ్తుందని అధికాారవర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, వాటికి పరిష్కార మార్గాలను కూడా చూపి, ఆమోదించినప్పుడే ముసాయిదా బిల్లుగా రూపాంతరం చెందుతుంది. ఆ లెక్కన జనవరి చివరి వారంలో ముసాయిదా కేంద్ర మంత్రివర్గం ముందుకు చర్చకొస్తుంది. వ్యక్తమయ్యే అభ్యంతరాలు, సలహాలు, సూచనలు, సమస్యల వంటివాటికి స్పష్టమైన హామీలతో కూడిన పరిష్కారాలు చూపుతూ బిల్లులో సవరణలు చేయాలని పార్లమెంట్‌లో పార్టీలు పట్టుబట్టే అవకాశముంటుంది గనుక ఆ కసరత్తును కేంద్రం ముందే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా ప్రస్తుత ముసాయిదాలో అవసరమైన సవరణలతో బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించాక దాన్ని మళ్లీ రాష్ట్రపతికి నివేదించాలి. దాన్నాయన పరిశీలించి, ఆమోదముద్ర వేశాక ఆయన సూచనల మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఇంత ప్రక్రియ పూర్తవడానికి ఉన్న కొద్ది సమయం సరిపోతుందా? బిల్లు అంతే వేగంగా కదులుతుందా? పరిస్థితులెలా ఉంటాయి? ఇలాంటి సందే హాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికలు
మరోవైపు లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. 2009 సార్వత్రిక ఎన్నికలకు ఆ ఏడాది మార్చి 2వ తేదీనే షెడ్యూలు విడుదలైంది. 2014 మార్చి మూడో వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ కూడా డిసెంబర్ 14న అమెరికా పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఆ ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో సమావేశాలు కూడా పూర్తి చేశారు. ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం మే 31తో ముగుస్తున్నందున, ఆలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉన్నందున అన్ని చర్యలు తీసుకున్నట్టు కూడా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విభజన బిల్లు చివరి అంకంలో ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది అంచనాలకు అందడం లేదు.
ఫిబ్రవరిలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ దఫా కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి వీలులేదు. ఓట్ ఆన్ అకౌంట్‌ను మాత్రమే పార్లమెంట్‌లో ఆమోదించాలి. అది ఫిబ్రవరిలో జరిగే అవకాశముంది. 2009లోనూ అదే సమయంలో ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టడం తెలిసిందే. ఫిబ్రవరి 12 నుంచి 26 వరకు సెలవులు పోను పది రోజులు మాత్రమే అప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 13న రైల్వే, 16న సాధారణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లను పార్లమెంటు ఆమోదించింది. ఈసారి కూడా ఓట్ ఆన్ అకౌంట్‌ను ఆమోదించుకోవడానికి ఫిబ్రవరిలోనే పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి. అవి ఫిబ్రవరి 3 నుంచి జరగవచ్చని చెబుతున్నారు. అందుకు ఫిబ్రవరి 3, 5, లేదా 10వ తేదీలను పరిశీలిస్తున్నట్టు కేంద్రంలోని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అసెంబ్లీ అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక నివేదిక రాష్ట్రపతికి చేరడానికి జనవరి 26 వరకు గడువుండటం తెలిసిందే. అక్కడి నుంచి ఫిబ్రవరి మరో ఐదు రోజులే ఉంటుంది. ఇక ఫిబ్రవరిలో విధిగా పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో విభజన బిల్లు కోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలంటూ ఏవీ నిర్వహించే అవకాశాల్లేవు.
ఈ సమావేశాల్లోనైతే మద్దతు
మరోవైపు జాతీయ స్థాయిలో శరవేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, మారుతున్న రాజకీయాల నేపథ్యంలో పార్లమెంటులో విభజన బిల్లు సాధారణ మెజారిటీతో గట్టెక్కడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలకంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లు పెడితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని బీజేపీ జాతీయ నాయకత్వం ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసింది. అయితే, ‘ప్రస్తుత శీతాకాల సమావేశాలు’ అని వారు నొక్కి చెప్పడంలోని ఆంతర్యం ఏమిటన్న దానిపై కూడా చర్చ సాగుతోంది. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడ్డామని స్పష్టంగా ప్రకటించి కూడా ఇలా శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేయడం రకరకాల విశ్లేషణలకు తావిస్తోంది. బీజేపీ ఎంతగా నొక్కి చెప్పినా శీతాకాల సమావేశాల్లో బిల్లు పార్లమెంట్ ముందుకు దేవుడెరుగు, ఇంకా అసెంబ్లీ నుంచి రాష్ట్రపతి భవన్‌కే చేరలేదు. తాజాగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఊపుమీదున్న బీజేపీ, శరవేగంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిల్లుపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది కూడా చర్చనీయంగానే ఉంది. వారు చెప్పినట్టు శీతాకాల సమావేశాల్లో బిల్లు పార్లమెంటుకు రాలేదు. ఫిబ్రవరిలో సమావేశాల్లో బిల్లు పెడితే ఏం చేస్తామన్న అంశంపై మాత్రం బీజేపీ నేతలెవరు ఇంతవరకూ మాట్లాడకపోవడం గమనార్హం. మరోవైపు బిల్లుకు ఆమోదముద్ర పడటానికి పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీ సరిపోతుందన్నది నిజమే అయినా ఈ విషయంలో లోక్‌సభలో ఉన్నంత సానుకూల పరిస్థితులు కాంగ్రెస్‌కు రాజ్యసభలో లేవన్నది కూడా అందరికీ తెలిసిందే. ఇలా ఎటు చూసినా సంక్లిష్టతలే కన్పిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన బిల్లు చివరి అంకంలో ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తోంది.