
ఐటీసీ లాభం 21 శాతం జూమ్
న్యూఢిల్లీ: దేశీ ఎఫ్‌ఎంసీజీ అగ్రగామి ఐటీసీ.. ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో కంపెనీ నికర లాభం 21 శాతం దూసుకెళ్లి రూ.2,231 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,836 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం కూడా రూ.7,146 కోట్ల నుంచి రూ.7,776 కోట్లకు పెరిగింది. 8.81 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రధాన విభాగమైన ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం మెరుగైన పనితీరు కంపెనీకి క్యూ2లో లాభాల జోరుకు తోడ్పాటునందించింది. ఎంఫ్‌ఎంసీజీ(సిగరెట్లు, ఇతరత్రా) విభాగం ఆదాయం క్యూ2లో రూ.5,076 కోట్ల నుంచి రూ.5,686 కోట్లకు పెరిగింది. 12 శాతం వృద్ధి చెందింది. ఇక ఇదే విభాగంలో కీలకమైన సిగరెట్ల వ్యాపార ఆదాయం 10 శాతం ఎగసి రూ.3,724 కోట్లకు చేరింది. నాన్ ఎఫ్‌ఎంసీజీ విభాగం(హోటళ్లు, అగ్రి, పేపర్‌బోర్డు, పేపర్, ప్యాకేజింగ్) ఆదాయం మాత్రం స్వల్పంగా 3.08 శాతం క్షీణించి రూ.3,198 కోట్లుగా నమోదైంది. కాగా, ఐటీసీ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 0.74 శాతం క్షీణించి రూ.340 వద్ద స్థిరపడింది.