సిగరెట్ల పన్నుపై క్లారిటీ: దూసుకెళ్తున్న ఐటీసీ
పొగాకు, సిగరెట్ల ఉత్పత్తుల పన్ను పరిమితిపై జీఎస్టీ కౌన్సిల్ క్లారిటీ ఇవ్వడంతో సిగరెట్ కంపెనీలు దూసుకెళ్తున్నాయి.
పొగాకు, సిగరెట్ల ఉత్పత్తుల పన్ను పరిమితిపై జీఎస్టీ కౌన్సిల్ క్లారిటీ ఇవ్వడంతో సిగరెట్ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. ఇంట్రాడేలో ఐటీసీ 7 శాతం మేర లాభపడి రూ.288 వద్ద ట్రేడైంది. ప్రతి వెయ్యి సిగరెట్లకు రూ.4,170 లేదా 290 శాతం పన్ను పరిమితిని విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదముద్ర వేసిందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. బీడీలపై సెస్సు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో ఐటీసీతో పాటు మిగతా సిగరెట్ కంపెనీలు వీఎస్టీ ఇండస్ట్రీస్, గాడ్ఫ్రే ఫిలిప్స్, గోల్డెన్ టుబాకోలు దాదాపు 5 శాతం మేర లాభాలార్జిస్తున్నాయి.
మార్నింగ్ ట్రేడింగ్ లో ఐటీసీ టాప్ నిఫ్టీ గెయినర్ గా ఉంది. పన్ను పరిమితిపై క్లారిటీ ఈ కంపెనీలకు ఎక్కువగా సాయపడింది. నిఫ్టీ కీలక మార్కు 9200 స్థాయిని చేరుకోవడానికి ఐటీసీ ర్యాలీ ఎక్కువగా దోహదం చేసింది. దీంతో నిఫ్టీ సైతం రికార్డు బద్దలు కొడుతూ ప్రారంభమైన సంగతి తెలిసిందే. లగ్జరీ వస్తువులు, శీతల పానీయాలపై అత్యధికంగా 28శాతం జీఎస్టీని వసూలు చేయనున్న ప్రభుత్వం.. వీటిపై అదనంగా విధించే సెస్సు పరిమితి 15 శాతం పెంపుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. జీఎస్టీ అమలుతో భారీగా రెవెన్యూలు కోల్పోతున్న రాష్ట్రాలకు ఈ సెస్ ను ఉపయోగించనున్నారు.