ఐడియా: ఆరునెలలు 6జీబీ డేటా ఫ్రీ ...ఎలా?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఆపరేటర్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారీ సంస్థ ఐటెల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెలకు 1 జీబీ డ్యాటాను ఆరు నెలలపాటు ఉచితంగా అందించనుంది. అంతేకాదు ఈ ఆఫర్ ఈ రోజునుంచే ( బుధవారం) చెల్లుబాటులోకి రానుందని ప్రకటించింది.
ఆదిత్య బిర్లా గ్రూప్ మొబైల్ టెలికం సేవల సంస్థ ఐడియా ఐటెల్ అందిస్తున్న ఈ ఆఫర్ ఐటెల్‌కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో మాత్రమే అందుబాటులోఉంటుంది. దేశవ్యాప్తంగా పెద్దమొత్తం వినియోగదారులకు దీని మూలంగా లాభం చేకూరనుందనే విశ్వాసాన్ని ఐటెల్ సీఈవో సుధీర్ కుమార్ వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక నిత్యావసరంగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో మన జీవితాలు డిజిటల్ ప్లాట్ ఫాంలోకి మారిపోతున్నాయన్నారు . ఈ క్రమంలో ఐటెల్, ఐడియా యూజర్లకు సరసమైన ధరలో మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ అందించడమే తమ లక్ష్యమన్నారు.
ఈ ఆఫర్ పొందాలంటే యూజర్లు ఐటెల్ స్మార్ట్ ఫోన్ల లోని ఐడియా ద్వారా http://i4all.ideacellular.com/offers సైట్‌ను సందర్శించాలని కోరింది. అనంతరం గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేస్తే.. యూజర్ డివైజ్ ఐఎంఈఐ, ఫోన్ నెంబర్ వెబ్ సైట్ గుర్తిస్తుందని తెలిపింది. ఇక్కడ షో మై ఆఫర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి, 1 జీబీ ఆఫర్ ను సెలెక్ట్ చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుందని తద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలను ఆస్వాదించవచ్చని పేర్కొంది.
ఈ ప్లాన్ లో మొదటి నెల డాటా పూర్తిగా ఉచితం. ఆ తర్వాత ఆరునెలలు వరుసగా నెలలు 1 జీబీ డాటా ఫ్రీ. అలాగే నెలకు రూ. 50 లేదా అంతకు మించి ప్యాక్‌లు చెల్లించడం ద్వారా అదనపు డేటా, లేదా వాయిస్ కాల్స్‌ను పొందవచ్చని తెలిపింది.
మరోవైపు టవర్ల బిజినెస్‌ను కొనుగోలు చేసే యోచనలో అమెరికన్ టవర్ కంపెనీ(ఏటీసీ) అధికారులు ప్రస్తుతం ఐడియాతో చర్చలు జరుపుతోందిట. అటు వొడాఫోన్‌తో విలీనానికింటే ముందుగానే టవర్ల డీల్‌ను కుదుర్చుకోవాలని ఐడియా యాజమాన్యం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం ఇంట్రాడేలో ఐడియా షేరు 10 శాతం లాభపడింది.