
ప్రాణం పోయినా తప్పు చేయం
జేవీ నరసింగరావు శతజయంతి సభలో సీఎం కేసీఆర్
* నేడు రాజకీయ విలువలు దిగజారిపోయాయి
* తంగమంటే జంగమంటున్నారు.. అసహన వైఖరి పెరిగిపోయింది
* తెలంగాణ సమాజం తన వాళ్లను గౌరవించుకుంటుంది
* ఎందరో ప్రతిభావంతులున్నా తెరమరుగు చేశారు
* తెలంగాణ సాధనలో మేం పరోక్షపాత్ర పోషించాం: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభ్యున్నతి విషయంలో ప్రాణం పోయినా తప్పు చేయమని, ఇప్పుడేమైనా తప్పు జరిగితే రెండు తరాల వరకు ప్రభావం ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు.
నేడు రాజకీయ విలువలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తంగమంటే జంగమంటున్నారని, అసహన వైఖరి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఇది సమాజానికి మంచిది కాదన్నారు. చర్చలు కూడా ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జేవీ నరసింగరావు శతజయంతి ఉత్సవాల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు టి.ఉడయవర్లు తెలుగులో రాసిన ‘తెలంగాణ ముద్దుబిడ్డ- జేవీ నరసింగరావు’ పుస్తకాన్ని, సీనియర్ జర్నలిస్టు సీహెచ్ రాజేశ్వరరావు, డా.సీజీకే మూర్తి ఆంగ్లంలో రాసిన ‘జేవీ నరసింగరావు-ఎ జెంటిల్‌మెన్ పొలిటిషియన్’ పుస్తకాన్ని ఆవిష్కరించి, రచయితలను సన్మానించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ఏదైనా విషయంలో అర్థం కాకపోతే ఆరునెలల ఆలస్యమైనా.. అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలు తీసుకుని దీర్ఘకాలిక దృష్టితో సక్రమమైన మార్గంలో తెలంగాణను ముందు కు తీసుకెళ్తాం. సంస్థలు, పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ సాధన కోసం సాగిన 60 ఏళ్ల పోరాటంలో అందరి కృషి ఉంది. ప్రాణం పోయిన తప్పు వైపు ఉండబోం. ఏదో చేయాలన్న ధోరణితో వ్యవహరించం’’ అని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆటుపోట్లు, ఇబ్బందులు వందశాతం పరిష్కారం కావాలన్నారు.
తెలంగాణ సురక్షితంగా ఉంటుందన్న భావనతోనే ప్రజలు టీఆర్‌ఎస్ చేతిలో అధికారం పెట్టారని చెప్పారు. జేవీ నరసింగరావు విశిష్టతను ప్రభుత్వ పక్షాన ముందు తరాలకు తెలియజేసేందుకు వారి కుటుంబ సభ్యులు, సీనియర్ రాజకీయవేత్తలను సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జేవీ విలక్షణమైన వ్యక్తి అని, ప్రజా సమస్యలపై స్పందించడం ఆయన ఔన్నత్యానికి, వ్యక్తిత్వానికి సూచిక అన్నారు. చరిత్రలోని గొప్ప విషయాలను ముందుతరాలకు తెలియజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
పీవీ.. తెలంగాణ ఠీవీ
తెలంగాణ సమాజం తన వాళ్లను తాను గౌరవించుకుంటుందని, తెలంగాణలో ప్రతిభావంతులున్నా గతంలో తెర మరుగుచేశారని సీఎం అన్నారు. ఎవరు ఔనన్నా.. కాదన్నా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ ఠీవీ అని అన్నారు. ఆధునిక భారత్‌లో ఆర్థిక విధానాలు, సంస్కరణల ద్వారా ప్రగతిని తీసుకొచ్చి దేశ చరిత్రలో నిలిచిపోయారని, ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు తగిన గౌరవం లభించలేదని పేర్కొన్నారు. ఈ గడ్డపై పుట్టినవారెవరైనా తెలంగాణ కోసం పరితపించారని, తెలంగాణ సమాజం రావాలని కోరుకున్నారన్నారు. అయితే కొన్ని శక్తులు తెలంగాణను, నాయకులను విభజించు పాలించు అన్న చందంగా నడిపించాయని విమర్శించారు.
ప్రత్యక్ష, పరోక్ష పోరాటాల వల్ల తెలంగాణ: జానారెడ్డి
ప్రత్యక్ష, పరోక్ష పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి చెప్పారు. మలివిడత తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుందని, రాష్ట్ర సాధన కోసం పరోక్ష పోరాటం చేసి విజయవంతమైందని చెప్పారు. ‘‘అర్జునుడు రథాన్ని నడిపించినా, దాని వెనక ఉండి నడిపించిన వారు ఎందరో ఉన్నారు. దీన్ని సీఎం కాదు.. సభికులు గమనించాలి’’ అని అనడంతో సభలో నవ్వులు విరిశాయి.
‘‘గతంలో జేవీ నరసింగరావు తెలంగాణ ఏర్పాటు కోసం పరోక్షంగా ఎంతో కృషి చేసినా సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా ఛీత్కారాలు, అవమానాలు ఎదురైనా మేం గతంలో జేవీ నిర్వహించిన పాత్రను నిర్వహించాం’’ అని అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా జేవీ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, అవసరాన్ని గుర్తించి ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక పంపించడంతోపాటు పార్టీ పరంగా తీర్మానించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జేవీ నరసింగరావు కుమారుడు జేవీ నృపేందర్‌రావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పి.నరసారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ కె.కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ బి.కమలాకర్‌రావు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, జలగం వెంకటరావు, మాజీ ఎంపీ జి.వివేక్‌లు పాల్గొన్నారు.
గాంధీ భవన్‌లో వేడుకలు
జె.వి.నరసింగరావు శతజయంతి వేడుకలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నర్సారెడ్డి తదితరులు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలు, ఒప్పందాల్లోనూ నరసింగరావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.