పొలిటికల్ పతంగి
♦ మార్కెట్లో రాజకీయ పతంగుల హల్‌చల్
♦ ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్, మోదీ కైట్స్
♦ ఎన్నికల ప్రచారానికి వేదికగా వయ్యారి గాలిపటం!
పద పదవే వయ్యారి గాలి పటమా...
ఓట్ల వేటకు బయలు దేరుదామా..
గ్రేటర్ ఎన్నికల వేళ గల్లీ గల్లీలో ఇదే మన చిరునామా..
గెలుపు కోసం ఇద్దాం ఏదో ఒక నజరానా!
పద పదవే వయ్యారి గాలి పటమా...
...అంటూ మన సిటీ నేతలు ఇప్పుడు పతంగుల పాటలు పాడుతున్నారు. వాటితో ఆటలు ఆడుతున్నారు. కార్యకర్తలతో ఆడిస్తున్నారు. ఎన్నికల వేళ ఏ అవకాశాన్ని వదులుకోని మన రాజకీయ నేతలు ఇప్పుడు పతంగుల సీజన్‌ను మస్తుగా వినియోగించుకుంటున్నారు. సాధారణంగా నగరంలో సంక్రాంతి సీజన్‌లో ఆకాశ మంతా రంగురంగుల పతంగులే కన్పిస్తాయి. నగర వాసి సంప్రదాయ జీవనంలో పతంగులకు మంచి ప్రాముఖ్యత ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగు రంగుల పతంగులు ఎగురవేస్తూ సంక్రాంతి సీజన్‌లో సందడి చేస్తారు. నగరంలో ఏటా కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ముఖ్యంగా యువతపై కన్నేశారు. వారికి అవసరమైన పతంగుల సామగ్రిని అందుబాటులోకి తెస్తున్నారు. పతంగులు ఆడుతూనే... పార్టీ ప్రచారంలో పాల్గొనాలని చెబుతున్నారు. పతంగులపై ఆయా పార్టీల గుర్తులు, ముఖ్యనేతల చిత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఈ వరుసలో టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ముందున్నాయి. ఈ పార్టీల పతంగులు మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. ఇక ప్రచార ఆర్భాటంలో నువ్వా..?నేనా..? అన్నట్టుగా పోటీపడే ఆయా పార్టీల నేతలు పొలిటికల్ పతంగుల కొనుగోలుకు ఎగబడుతున్నారు. దీంతో కైట్స్ వ్యాపారం జోరుమీదుంది.
‘సయ్యాట’ కూడా ప్రచారమే...
ఇంటింటికి తిరిగి పార్టీల తరఫున ప్రచారం నిర్వహించడం మామూలే. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుండటంతో సామాజిక మాధ్యమాలను విరివిగా వాడేస్తున్నారు. ఏం చేసినా.. అంతిమ లక్ష్యం గెలవడమే అనుకునే నేతల నాడిని పసిగట్టారు వ్యాపారులు. సంక్రాంతికి భారీ స్థాయిలో కొనుగోలు అయ్యే పతంగులకు పొలిటికల్ కలర్ ఇచ్చారు. అంతే తమ నేతల ఫొటోలు, పార్టీ కలర్, గుర్తులతో ముద్రించిన పతంగులను కొనుగోలు చేసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా, ఆకాశంలో చూసినా తమ పార్టీ పతంగులే ఉండాలన్న ఉద్దేశంతో చాలా మంది కొనుగోలు చేసి తమ ఆత్మీయులకు, కార్యకర్తలకు కూడా పంచుతున్నారట.
‘ఇంటింటికి ప్రచారం చేసినట్టుగానే ఈ పతంగులతో కూడా మంచి పబ్లిసిటీ వస్తోంది. కింది నుంచి ఆకాశంలోకి ఎగిరే ఈ కైట్‌ల వల్ల ఎన్నికల జోష్ కనబడుతుంది. మంచి నేతను ఎన్నుకునేందుకు ఓటింగ్‌కు క్యూ కడతారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా రాజకీయాలపై ఓ ఐడియా వస్తుంద’ని అంటున్నారు ఆయా పార్టీల నేతలు. - సాక్షి, సిటీబ్యూరో
ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్ కైట్స్...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొటోలు ముద్రించిన పతంగులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. నరేంద్ర మోదీ ఫొటోతో ఉన్న కైట్స్ కూడా మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. పసుపు రంగుతో కూడిన టీడీపీ పతంగులు, కాంగ్రెస్ పార్టీ గుర్తు కలిగిన కైట్స్ కూడా కొన్నిచోట్ల లభిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ గుర్తు కైట్ కావడంతో ఆ పార్టీ కలర్ పోలిన పతంగులు కూడా భారీగానే మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే కేసీఆర్, మోదీ కైట్స్‌ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ కైట్ ఒక్కోటి రూ.15 నుంచి రూ.60 వరకు అమ్ముడవుతున్నాయి. ఒకేసారి బల్క్‌గా డజన్లకొద్దీ కైట్‌లు కొనుగోలు చేస్తున్నారు. వీరిలో చాలా మంది పార్టీ నాయకులే ఉంటున్నారు. ‘కేసీఆర్, మోదీ కైట్స్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మిగతా పార్టీలవి కూడా బాగానే అమ్ముడవుతున్నాయ’ని చెబుతున్నారు పతంగుల విక్రేత జాకీర్ హుస్సేన్.
పొలిటికల్ పతంగ్ ఈవెంట్
అన్ని పార్టీల పతంగులతో గగనంలో రాజకీయ సయ్యాట(ఈవెంట్) నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇందుకోసం సరైన వేదిక కోసం వెతుకుతున్నాం. మేం నిర్వహించే ఈ పొలిటికల్ పతంగుల ఈవెంట్ రాజకీయ హడావుడితో పాటు ఓటు ప్రాధాన్యతను తెలిపేలా ఉంటుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై అవగాహన ఉండాలి. అలా అయితేనే మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రాగలుగుతారు. పిల్లలకు ఇలాంటి ఈవెంట్ల ద్వారానైతే ఆసక్తిగా మన లక్ష్యాన్ని వివరించవచ్చు.
- పవన్, ద క్లాస్ టెక్నాలజీస్, రామంతాపూర్