జానా పాసా... ఫెయిలా..!
కాకలు తీరిన రాజకీయ యోధునిగా, అపార రాజకీయ అనుభవమున్న నేతగా అసెంబ్లీలో, బయటా నింపాదిగా, నెమ్మదిగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షనేత జానారెడ్డిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దూకుడుగా వ్యవహరించడం లేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వాడివేడి అస్త్రాలు సంధించడం లేదని పార్టీలోని యువతరం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరుతో అందరినీ ఆశ్చర్యంలో పడవేశారు. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజే కాంగ్రెస్ పనైపోయిందని, విపక్షాలపై అధికారపక్షం తిరుగులేని వ్యూహాలతో విజయం సాధించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.
ఇక పదిరోజుల పాటు సభ నిస్సారంగా అధికారపక్షం ఎట్లా చెబితే అట్లా నడవాల్సిందేనా అన్న సందేహాలు కూడా కాంగ్రెస్‌తో సహా వివిధపక్షాల ఎమ్మెల్యేల్లో వ్యక్తమైంది. రెండోరోజు సభ ముగిసేప్పటికీ అనూహ్యంగా విపక్షాలన్నింటిని జానారెడ్డి ఒకతాటిపైకి తీసుకురావడం ప్రభుత్వవర్గానికే ఆశ్చర్యానికి గురిచేసింది. మూడోరోజు కూడా అదే పంథాలో సాగి అధికారపక్షాన్ని నిలదీయడం, రోడ్డుపై బైఠాయించడం, ఎంఐఎం మినహా ఇతరవిపక్షాల సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు తరలించడం వంటివి చకచకసాగిపోయాయి.
ఈ పరిణామాలతో జానారెడ్డి నేతృత్వంలో విపక్షాలు పైచేయిని సాధించినట్లుగా అయ్యింది. ఇక సోమవారం నుంచి జరగనున్న సమావేశాల్లో వ్యూహ,ప్రతివ్యూహాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుత సమావేశాలు ముగిసేనాటికి స్లో అండ్ స్టడీ విన్స్‌ది రేస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్న జానారెడ్డి ప్రభుత్వాన్ని ఇరకునపెట్టగలుగుతారా లేక అధికారపక్షమే విపక్షాలను పూర్తిగా నిలవరించి సత్తాను చాటుకుంటుందా అన్నది చర్చనీయాంశమైంది. అయితే తరువాతి లేదా చివరి అస్త్రంగా జానారెడ్డి అవిశ్వాసతీర్మానం వంటిదాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాలన్నింటికి ఒకేతాటిపైకి తీసుకువస్తారా ? అన్నది వేచి చూడాలని పార్టీ ముఖ్యులు చెవులు కొరుక్కుంటున్నారట... చివరకు ఏమి జరుగుతుందోనని రాబోయే రోజుల కోసం ఒకింత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారట...!