
మంత్రుల తీరుపై జానారెడ్డి సీరియస్
రైతుల సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రులు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ల పద ప్రయోగంపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. ''మీరు మాట్లాడుతున్న తీరు, ప్రతి మంత్రి లేస్తున్న తీరును ఈ సభ చూస్తోంది.. సభలో మంత్రుల వైఖరి సరిగా లేదు. ఈ పాపం మీదే అని ఒప్పుకోవాలి. ఏదైనా సమస్య చర్చకు వస్తే వాళ్ల ఫీలింగ్ ఏంటి అనేది చూడాలి. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, మజ్లిస్, బీజేపీల సమస్య కాదు.. ప్రజల సమస్య. ప్రజల ఆవేదనను, బాధలను ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలని ప్రభుత్వం యోచించడానికి ఇది ఉపయోగపడాలి. ప్రజల బాధలను చెబుతున్నాం తప్ప కాంగ్రెస్ బాధ చెప్పడం లేదు.
ప్రజాస్వామ్యంలో ప్రజల బాధలను వినిపించడానికి ప్రతిపక్షం ఉంది, సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం ఉంది. ప్రజలు అన్నీ గమనించిన తర్వాత తీర్పు ఇస్తారు. ఈలోపే ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణం అంటే సబబు కాదు. దీన్ని పదే పదే అంటున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి చెబుతున్నాను. నువ్వెంత అంటే నువ్వెంత అనడానికి ఈ సభ లేదు. అలాంటి పదాలు ప్రయోగిస్తే సభ సజావుగా జరగదని చెబుతున్నా'' అని ఆయన స్పష్టం చేశారు.
దానికి సీఎం కేసీఆర్ స్పందించారు. ''జానారెడ్డి సూచన స్వీకరించాల్సిందే. పరస్పర నిందారోపణకు బదులు అసలు సమస్యపై దృష్టిపెట్టాలి. సభా సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని మాట్లాడాలి. ఇక దీనిపై మాట్లాడకుండా అసలు సమస్యలోకి వెళ్దాం. పూర్తిస్థాయిలో సభ జరగాలని కోరుకుంటున్నాం. ప్రతిపక్షాల నుంచి ఉత్తమ సలహాలు వస్తాయని భావిస్తున్నా. నిర్మాణాత్మకమైన సలహాలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అవి అందరూ అందించండి'' అని ఆయన చెప్పారు.