ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్
న్యూఢిల్లీ: భారతదేశ తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ‘సైనిక తిరుగుబాటు’ భయం వెన్నాడుతుండేదని సైనికదళాల మాజీ ప్రధానాధికారి జనరల్ వీకే సింగ్ పేర్కొన్నారు. చైనా దాడుల కన్నా ఆర్మీ చీఫ్‌లకు ప్రజాభిమానం పెరగడం పైనే నెహ్రూ ఎక్కువ ఆందోళన చెందేవాడని వ్యాఖ్యానించారు. తన ఆత్మకథ ‘కరేజ్ అండ్ కన్విక్షన్’లో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ తిమ్మయ్యకు వ్యక్తిగతంగా పెరుగుతున్న ప్రజాభిమానం నెహ్రూకు పీడకలలు తెప్పించేదన్నారు. బల్దేవ్ సింగ్‌లోని కుట్రలను తిప్పికొట్టగల రాజకీయ చాణక్యతను చూసే దేశ తొలి రక్షణ మంత్రిగా ఆయనను నెహ్రూ నియమించారన్నారు. నెహ్రూ చుట్టూ ఉన్నవారు సైనిక తిరుగుబాటు బూచిని చూపి పౌర, సైనిక వ్యవస్థల మధ్య సత్సంబంధాలు ఏర్పడకుండా అడ్డుపడేవారని సింగ్ తెలిపారు.
1962నాటి చైనా యుద్ధ సమయంలో సైనిక దళాలను సిద్ధంగా ఉంచడంలో దేశ నాయకత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ‘చండీగఢ్ మేథోవర్గం’ సూచనల మేరకు ఆయన నడుచుకునేవారని వెల్లడించారు. నెహ్రూ నుంచి రాజకీయ నాయకత్వాన్నే కాకుండా ఆయన భయ లక్షణాలను కూడా ఇందిరాగాంధీ పొందారని విమర్శించారు. వయసుకు సంబంధించిన వివాదంలో కేంద్రంతో పోరాడిన సింగ్.. ఆ వివాదంలో ప్రధాని కార్యాలయంలోని ఒక ఉన్నతాధికారి హస్తం ఉందని ఆరోపించారు. ఆ సమయంలో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సూచన మేరకే తాను రాజీనామా చేయలేదని సింగ్ ఆ పుస్తకంలో రాశారు. అయితే, రాజీనామా చేయవద్దని తాను చెప్పలేదని ప్రతిభాపాటిల్ స్పష్టంచేశారు.