మళ్లీ తమిళనాడు సీఎంగా జయ?
అక్రమాస్తుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడటంతో ఆమెకు రాజకీయంగా కూడా పెద్ద ఊరట లభించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన జైల్లోకి వెళ్లడంతో పాటే.. తన శాసన సభ్యత్వాన్ని కూడా కోల్పోయి, ముఖ్యమంత్రి పదవికి దూరమైన జయలలిత.. ఇప్పుడు మరోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఆమె అనుంగు అనుచరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత కోసం ఏ క్షణంలోనైనా తన పదవిని వదులుకోడానికి సిద్ధంగా ఉన్నారు.
అమ్మ కోసం ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే పూజలు ఆరంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో అభిషేకాలు, హోమాది పూజలు, పాలబిందెలతో ఊరేగింపులు జరిగాయి. ఎట్టకేలకు 'అమ్మ' మళ్లీ ముఖ్యమంత్రి కానుండటంతో.. తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తున్నారు. పార్లమెంటు హాల్లో కూడా అన్నా డీఎంకే ఎంపీలు స్వీట్లు పంచిపెట్టారు.