ఆర్కేనగర్‌లో జయలలిత ఘన విజయం
ఉప ఎన్నికల్లో లక్షన్నర మెజారిటీ సాధించిన జయ
ఎంపీలో బీజేపీ, కేరళ-మేఘాలయల్లో కాంగ్రెస్, త్రిపురలో సీపీఎం
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానంలో ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సి.మహేంద్రన్‌పై 1,51,252 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపు 88 శాతం పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో సీపీఐ మినహా మరే ప్రధాన పార్టీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకపోవటంతో జయ గెలుపు నల్లేరుపై బండి నడకలా మారింది. మంగళవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే మహేంద్రన్ జయ దరిదాపుల్లోకీ రాకుండా పోయారు. 17వ రౌండ్ ముగిసేసరికి పోలైన మొత్తం 1,81, 420 ఓట్లలో 1,60,432 ఓట్లు జయకే వచ్చాయి. మహేంద్రన్‌కు పోలైన ఓట్లు కేవలం 9,710 కాగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి 4,590 ఓట్లు తెచ్చుకోగలిగారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో పాటు, డీఎండీకే, బీజేపీ, పీఎంకే, ఎండీఎంకే, వీసీకే తదితర పార్టీలు ఎన్నికలను బహిష్కరించినప్పటికీ 25 మంది స్వతంత్రులు ఈ ఎన్నికలో పోటీ పడ్డారు. మహేంద్రన్‌తో సహా జయపై పోటీ చేసిన ఏ ఒక్క అభ్యర్థికీ డిపాజిట్ కూడా దక్కలేదు.
గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష పడడంతో శ్రీరంగం నియోజకవర్గం ఎమ్మెల్యే అర్హతను, ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయారు. అదే కేసులో కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకుని నిర్దోషిగా బైటపడడంతో గత నెల 23వ తేదీన ఆమె తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. సీఎం పదవిని చేపట్టిన ఆరునెలల్లో తిరిగి ఎన్నిక కావటం తప్పనిసరి కావటంతో ఆర్కేనగర్ ఎమ్మెల్యే పి. వెట్రివేల్‌చే రాజీనామా చేయించి జయ ఉప ఎన్నికకు వెళ్లిన సంగతి తెలిసిందే. జయలలిత గెలుపుతో రాజధాని చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పలు చోట్ల పూజలు నిర్వహించారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌లు జయలలితకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జయ విజయంపై విచారణ జరిపించాలని ఆమె ప్రత్యర్థి సీపీఐ నేత మహేంద్రన్ డిమాండ్ చేశారు.
అధికార పార్టీలదే విజయం
ఆర్కేనగర్‌తో పాటు మొత్తం 5 రాష్ట్రాల్లోని 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే గెలిచారు. కేరళలోని అరువిక్కరలో కాంగ్రెస్‌కు చెందిన కేఎస్ శబరినందన్ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో గరోత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి చందర్‌సింగ్ సిసోడియా గెలుపొందారు. త్రిపురలో ప్రతాప్‌గఢ్, సుర్మా స్థానాలను అధికార సీపీఎం చేజిక్కించుకుంది. మేఘాలయలోని చోక్‌పాట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బ్లుబెల్ ఆర్ సంగ్మా 2550 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.